AP Election Results: వైఎస్‌ జగన్‌కు భారీ మెజార్టీనా? పవన్‌ కల్యాణ్‌కా?.. కాయ్‌ రాజా కాయ్‌

Betting On YS Jagan Pulivendula And Pawan Kalyan Pithapuram Results: భారీ ఓటింగ్‌తో దేశం దృష్టిని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ఇప్పుడు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారని చర్చ జరుగుతుండగా.. గెలుపోటములపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ముఖ్యంగా జగన్‌, పవన్‌ కల్యాణ్‌పై బెట్టింగ్‌ రాయుళ్లు పందేలు కాస్తున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 24, 2024, 12:29 PM IST
AP Election Results: వైఎస్‌ జగన్‌కు భారీ మెజార్టీనా? పవన్‌ కల్యాణ్‌కా?.. కాయ్‌ రాజా కాయ్‌

Betting On AP Elections: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు ఇచ్చే తీర్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు విడుదలైన సర్వేలు కొన్ని వైఎస్సార్‌సీపీ.. మరికొన్ని కూటమికి మద్దతుగా ఇచ్చాయి. ఇక ఎన్నికల ప్రచారం హోరుగా సాగి.. మే 13వ తేదీన భారీ ఓటింగ్‌ నమోదైంది. దేశ, విదేశాల నుంచి తరలివచ్చి మరి ఏపీ ఓటర్లు తమ భవిష్యత్‌ కోసం ఓటు వేశారు. అయితే వారు ఇచ్చిన తీర్పుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చేది ఎవరు? అనే ఉత్కంఠ నెలకొనగా.. దీనిపై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ.. ఆఫ్‌లైన్‌లోనూ బెట్టింగులు జరుగుతున్నాయి. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ కోట్లలో బెట్టింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం.

Also Read: Kodali Nani: సోఫాలో కుప్పకూలిపోయిన కొడాలి నాని.. ఓటమి భయంతో అస్వస్థత?

పవన్‌ గెలుస్తాడా? ఓడుతారా?
అయితే ఏపీలో ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలపై కూడా పందేలు సాగడం గమనార్హం. ఏపీ ఎన్నికల్లోనే పిఠాపురం ఎన్నిక ప్రత్యేకమైనది. కూటమి తరఫున ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీకి దిగడమే కారణం. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఓడిపోయిన పవన్‌ ఈసారి సురక్షితమైన పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. అత్యధికంగా అతడి సామాజికవర్గం ఉండే నియోజకవర్గం కావడంతో ఈసారి సులువుగా పవన్‌ గెలుస్తారనే ధీమా కూటమిలో ఉంది. అయితే పవన్‌ కల్యాణ్‌ గెలుపు పక్కా కానీ ఏ స్థాయిలో మెజారిటీ సాధిస్తారనేది ప్రత్యేక చర్చ జరుగుతోంది. 20 వేలకు పైగా మెజార్టీ సాధిస్తారని కూటమి భావిస్తోంది. అయితే పవన్‌ అభిమానులు, జన సైనికులు మాత్రం దాదాపు లక్ష మెజారిటీ సాధిస్తారని అతి విశ్వాసంతో ఉన్నారు.

Also Read: Pinnelli Anticipatory Bail: ఎమ్మెల్యే పిన్నెల్లి సంచలన నిర్ణయం.. అరెస్ట్‌ కాకుండా కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

 

పిఠాపురం ఫలితంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పవన్‌ మెజార్టీపై తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు కూడా బెట్టింగ్‌ కాస్తున్నారు. ఓడిపోతారని కొందరు గెలుస్తారని మరికొందరు.. మరికొందరేమో వచ్చే మెజార్టీపై లెక్కలు వేస్తూ భారీగా బెట్టింగ్‌లు వేస్తున్నారు. పవన్‌ గెలుస్తాడా ఓడిపోతాడా? అని మొదలుపెట్టి మెజార్టీ 20 వేలు, 30 వేలు.. కొందరేమో లక్ష మెజార్టీ పొందుతారని బెట్టింగ్‌లు చేస్తున్నారు.

పులివెందులపై
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందులపై కూడా బెట్టింగులు జరుగుతుండడం విశేషం. వైనాట్‌ పులివెందుల అని టీడీపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇక్కడ ప్రచారాన్ని ముమ్మరంగా చేసింది. గెలవకపోయినా జగన్‌ మెజార్టీ తగ్గించాలని కూటమి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తోడు వైఎస్‌ జగన్‌ సోదరి, ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తుండడంతో వైఎస్‌ అభిమానుల్లో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జగన్‌కు మెజార్టీ తగ్గుతుందని అందరూ భావిస్తున్నారు. జగన్‌ మెజార్టీపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి.

4న తేలనున్న భవితవ్యం
బెట్టింగ్‌కు కాదేదీ అనర్హం అన్నట్టు బెట్టింగ్‌రాయుళ్లు జగన్‌, పవన్‌ కల్యాణ్‌కు మధ్య మెజార్టీపై కూడా బెట్టింగ్‌లు చేస్తుండడం విశేషం. జగన్‌ కన్నా పవన్‌కు అత్యధిక మెజార్టీ వస్తుందని పవన్‌ అభిమానులతోపాటు కూటమి మద్దతుదారులు బెట్టింగ్‌ కాస్తుండగా.. జగన్‌ అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు 'పవన్‌ కన్నా జగన్‌కే అత్యధిక మెజార్టీ' అని బెట్టింగ్‌ చేస్తున్నారు. బెట్టింగ్‌ వేయడానికి ఆయా నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌ సరళిని కూడా పరిశీలిస్తున్నారు. అయితే పందెం కాసిన వారికి ఎవరికి లాభమో నష్టమో అనేది జూన్‌ 4వ తేదీన ఫలితాల వెల్లడితో తేలనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News