Nellore Politics: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య పొసగడం లేదు. పార్టీ అధినేతల వరకు బాగానే క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదు. పనులు, ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఇరు పార్టీలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తుండగా వివాదాలు మొదలవుతున్నాయి. ఇప్పటివరకు ఎమ్మెల్యేల వరకు ఆ వ్యవహారం నడవగా.. తాజాగా ఓ ఎంపీకి కూడా ఈ వివాదం చుట్టుముట్టింది. ఓ సమావేశంలో అందరికీ పుష్పగుచ్ఛాలు ఇచ్చిన అధికారులు ఓ ఎంపీకి మాత్రం ఇవ్వకుండా తీవ్రంగా అవమానించారు. తనకు అవమానం జరగడంతో సదరు ఎంపీ అలిగి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: AP Liquor: ఏపీలో మందుబాబులకు మహిళలకు షాక్.. వైన్స్ వద్దంటూ ఎక్కడికక్కడ మహిళల అడ్డగింత
నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం కూటమి పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మహమ్మద్ ఫరూక్, ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశానికి హాజరవుతున్న క్రమంలో స్వాగతం పలుకుతూ మంత్రులకు కొందరు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా సమావేశానికి రాగా ఎవరూ కూడా పుష్పగుచ్ఛం అందించలేదు.
Also Read: AP Assembly Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు, నవంబర్ 11 న బడ్జెట్
ఈ అవమానం తాళలేక గౌరవం లేని చోట తాను ఉండనని చెప్పి ఎంపీ వేమిరెడ్డి సభా వేదిక దిగి బయటకు వెళ్లిపోయారు. ఎంపీ అలిగి వెళ్లిన విషయం స్థానికంగా కలకలం రేపడంతో వెంటనే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి రంగంలోకి దిగి ఎంపీని శాంతపర్చారు. నచ్చజెప్పి మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామని బుజ్జగించడంతో ఎంపీ వేమిరెడ్డి మెత్తబడి తిరిగి సమావేశానికి వచ్చారు. కాగా ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు, సభ్యత్వ నమోదుపై కూటమి నాయకులు చర్చించారు. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని.. నెల్లూరు జిల్లా అభివృద్ధిపై కలిసికట్టుగా ముందుకు వెళ్తామని కూటమి ప్రతినిధులు ప్రకటించారు. చిన్న చిన్న విభేదాలు ఉంటే సర్దుకుని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. నీటి సంఘాల ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
కూటమి పార్టీల్లో లుకలుకలు రావడం కలకలం రేపుతున్నాయి. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం మొదలుకుని రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గంలో పార్టీల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. ఒక పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట మిత్రపక్ష పార్టీల నాయకులు సహకరించడం లేదు. కూటమి పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో పెరుగుతోంది. పార్టీల మధ్య అసంతృప్తులు తీవ్రరూపం దాల్చకముందే పార్టీల అధిష్టానాలు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం క్షేత్రస్థాయి నాయకుల నుంచి వినిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.