అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగినందు వల్లే తాను ఓడిపోయి, తన ప్రత్యర్థి మల్లాది విష్ణు గెలుపొందారని, అందుకే ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు ఎన్నికను రద్దు చేయాలంటూ కోరుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వర రావు చేసుకున్న విజ్ఞప్తిని హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎన్నికల ఫలితంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలి తప్ప, రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని సూచిస్తూ బోండా ఉమ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 25 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ బొండా ఉమ ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.