వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. తునిలో కాపు ఉద్యమంలో భాగంగా ఉద్యమకారులు రైలు తగలబెట్టలేదని.. చంద్రబాబే తన కుట్రలో భాగంగా ఆనాడు రైలుకి నిప్పంటించమని పలువురికి చెప్పారని జగన్ ఆరోపణలు చేశారు. తునికి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదన్నారు. తుని ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాండవ నదిలో ఇసుకను తోడేస్తున్న మాఫియాకి చంద్రబాబుతో సంబంధాలు ఉన్నాయని జగన్ తెలిపారు. కాపు ఉద్యమం సమయంలో ఎందరో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని జగన్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆ కేసులను ఎత్తివేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. అలాగే టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యావ్యవస్థ కూడా గాడి తప్పుతుందని.. వైసీపీ అధికారంలోకి వస్తే తాము ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి కేంద్రీకరిస్తామని.. వాటిని కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా తీర్చిదిద్దుతామని జగన్ తెలిపారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర 234వ రోజు శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చేరుకుంది. తుని యాత్రతో వైఎస్ జగన్ పాదయాత్ర 2700 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. జగన్ తొలుత డీజే పురం మీదుగా తుని మండలం వి.కొత్తూరు పంచాయతీకి చెందిన వెలంపేట సమీపంలో ఏర్పాటు చేసిన బస ప్రాంగణానికి చేరుకొని.. ఆ తర్వాత మళ్లీ యాత్రలో పాల్గొన్నారు.