చిత్తూరు నగరంలో ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి.. డూప్లికేట్ ఏటీఎం కార్డులను తయారు చేసే ముఠా ఒకటి పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. పలమనేరు ప్రాంతంలో కొన్ని నెలలుగా నివాసముంటున్న అయిదుగురు తమిళనాడు, శ్రీలంక యువకులు గత కొంతకాలంగా అధునాతన సాంకేతికత సహాయంతో ఏటీఎం క్లోనింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. వారి పథకాల్లో భాగంగా తొలుత పెద్దగా జనసంచారం లేని ఏటీఎం సెంటర్లను ఎంచుకుంటారు. ఆ ఏటీఎం సెంటర్లలోని మిషన్లలో ఎవరికీ అనుమానం రాకుండా ఒక ప్రత్యేక యంత్రాన్ని అమరుస్తారు.
ఆ యంత్రంలో కార్డు రీడర్ ఉంటుంది. అలాగే ఏటీఎం పిన్ టైపు చేస్తున్నప్పుడు.. ఆ పిన్ నెంబరును రికార్డు చేసేందుకు చాలా చిన్న కెమెరాను కూడా మిషన్ పై భాగంలో ఎవరికీ అనుమానం రాకుండా ఫిక్స్ చేస్తారు. అలా రీడర్ మరియు కెమెరా ద్వారా రికార్డైన కార్డు డేటాతో పాటు పిన్ డేటా కూడా ఎప్పటికప్పుడు వీడియో ఫార్మాట్లో తమ వద్దనున్న కంప్యూటర్లకు చేరేలా వీరు ప్లాన్ చేశారు. అలా తమ వద్దకు చేరిన సమాచారం సహాయంతో కొత్త ఏటీఎం కార్డులను తయారుచేసి.. నగదును డ్రా చేస్తున్నారు.
ఇటీవలే 22 మంది ఖాతాదారులు తాము ఏటీఎం వాడకుండానే డబ్బులు విత్ డ్రా చేస్తున్నట్లు పదే పదే ఫోన్లో సందేశాలు వస్తున్నాయని.. పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఈ కేసును పలమనేరు పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకొని సైబర్ క్రైమ్ టీం సహాయంతో దగ్గరలోని ఉన్న అన్ని ఏటీఎం సెంటర్లలోని సీసీ టీవీ కెమెరాలు చెక్ చేయించారు. వాటి సహాయంతో ఒక టీమ్ అనుమానితుల లిస్ట్ తయారు చేసి.. వారిపై నిఘా పెట్టి.. వారి మొబైల్ నెంబర్లు కనుక్కొని.. కాల్ డేటా సేకరించడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
తీగ లాగితే డొంకంతా బయట పడింది అన్నట్లు.. చాలా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల సహాయంతో ఈ ముఠా ఇలాంటి నేరాలకు పాల్పడడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. వారి నుండి దాదాపు 12 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ ఆదేశాలతో స్థానిక డీఎస్పీ చౌడేశ్వరి, సీఐ వెంకట్వేర్లు ఒక టీమ్‌గా ఏర్పడి ఈ కేసును సవాల్‌గా తీసుకొని రెండు నెలలు శ్రమపడి ముఠాను గాలించి పట్టుకున్నారు. ఇలాంటి కేసు గతంలో ఢిల్లీలో మాత్రమే జరిగిందని.. ఆంధ్రాలో జరగడం తొలిసారని పోలీసులు చెబుతున్నారు.