AP Assembly Session: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్‌ బాటలోనే వైఎస్‌ జగన్‌

YS Jagan Follows As KCR He Will Be Skip AP Assembly Session: అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హాజరవుతారా? లేదా అనేది ఉత్కంఠ నెలకొంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 21, 2024, 06:15 PM IST
AP Assembly Session: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్‌ బాటలోనే వైఎస్‌ జగన్‌

AP Assembly Session: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల అనంతరం ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే. ఎన్నికల అనంతరం సభ్యుల ప్రమాణస్వీకారం కోసం అసెంబ్లీ రెండు రోజులు నిర్వహించినా పాలనాపరంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న తొలి అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి.

ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. నెలన్నర రోజుల్లో ఏపీ రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. నాడు అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానం కూడా దక్కకపోవడం విస్మయానికి గురి చేసే అంశం. ఇక అఖండ మెజార్టీతో అధికారంలోకి కూటమి ప్రభుత్వం రావడంతో అసెంబ్లీ పసుపు, కాషాయంతోపాటు ఎరుపు రంగుతో అసెంబ్లీ సీట్లు నిండిపోనున్నాయి.

షెడ్యూల్‌ ఇదే..

  • సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • శాసనసభ, మండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం.
  • అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్న బీఏసీ.
  • ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం

టీడీపీ
సోమవారం ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకుంటారు. పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని వారు రానున్నారు. ఇక జనసేన పార్టీ ఎమ్మెల్సీలు తమ కండువాలు వేసుకుని హాజరవుతారు. బీజేపీ ఎమ్మెల్యేలు కాషాయ రంగు కండువాలు వేసుకని సభకు వచ్చే అవకాశం ఉంది.

త్రైమాసికానికే బడ్జెట్‌?
అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ బడ్జెట్‌కు ఈ నెలాఖరుతో  గడువు ముగియనుంది. అయితే మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకపోవడంతో పాలనపై పూర్తి దృష్టి సారించని పక్షంలో తాత్కాలిక బడ్జెట్‌ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. 

కాగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈనెల 23వ తేదీన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెడుతామని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఇక గత ప్రభుత్వంపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ప్రభుత్వం.. మిగతా 3 అంశాలపై అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ఘోర తప్పిదాలు, అవినీతి చేసిందని ఆరోపిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీలో శాంతిభద్రతలు, మద్యం, ఆర్థికశాఖల అంశాలపై సభలో చర్చ పెట్టనుంది.

డైలామాలో వైఎస్సార్‌సీపీ
శాసనసభ ఎన్నికల్లో ఊహించని ఫలితం నుంచి ఇంకా కోలుకోలేని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు ఇంకా సిద్ధం కాలేదు. ఈ సమావేశాలకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరవుతారా? లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రమాణస్వీకారం కోసం ఏర్పాటుచేసిన అసెంబ్లీ సమావేశాలకు జగన్‌ అంటిముట్టనట్టు ఉన్నారు. ఇప్పుడు జరిగే వర్షాకాల సమావేశాలకు ఆయన హాజరు కారని తెలుస్తోంది. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, తమ పార్టీ శ్రేణులకు రక్షణ లేదని మాజీ సీఎం జగన్‌ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై తీవ్ర పోరాటానికి సిద్ధమవుతున్నారు.

ఢిల్లీ ధర్నా..
ఈనెల 24న ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు. మరి ఈ క్రమంలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు. జగన్‌పై మూకుమ్మడి దాడి చేసేందుకు అధికార పార్టీ పూర్తిగా సిద్ధమైంది. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో జగన్‌ కూడా అలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంది. ఇక ఢిల్లీలో జరిగే ధర్నాకు జగన్‌ వెళ్లనున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News