Global Investors Summit 2023: విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఊహించని విధంగా సక్సెస్ కావడం ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదు. సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు, పరిశ్రామలు రావనే విమర్శలకు ఒకే ఒక్క సదస్సుతో సమాధానమిచ్చేశారు జగన్. అందుకే ప్రతిపక్షాలింకా స్పందించలేకపోతున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మార్క్ ఏంటో చూపించారు. విశాఖలో తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుపై చాలా విమర్శలే వచ్చాయి మొన్నటి వరకూ. దీనికితోడు నాలుగేళ్ల పాలన అంతా సంక్షేమం తప్ప అభివృద్ధి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు జగన్ పాలనలో పరిశ్రమలే రావని..పరిశ్రమలంటే చంద్రబాబుతోనే సాధ్యమనే వాదన కూడా విన్పించింది. ఈ అన్నింటికి సైలెంట్ గా సమాధానమిచ్చారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో అందరి నోళ్లు మూయించారు. ముఖ్యంగా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్తల్ని విశాఖ వేదికపైకి ఒకేసారి రప్పించిన తీరు అందర్నీ ఆశ్చర్యపర్చింది.
మూడు నెలల గ్రౌండ్ వర్క్
మూడు నెలలుగా విశాఖ సమ్మిట్‌పై వైఎస్ జగన్ చాలా సైలెంట్ వర్క్ చేశారు. ప్రచారం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. పారిశ్రామికవేత్తలతో నేరుగా మాట్లాడి ఒప్పించారు. అందరితో మాట్లాడిన తరువాత వచ్చిన కమిట్‌మెంట్స్ ప్రకారం ఎంవోయూలు సిద్ధం చేశారు. రెండ్రోజుల సదస్సులో 353 ఎంవోయూలతో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా ఊహించని పరిణామం. 2 లక్షల కోట్ల పెట్టుబడుల అంచనాలను దాటి 13 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం నిజంగా అద్భుతం. ఏపీ అభివృద్ధికి ఇది అవసరం. ప్రభుత్వం అంచనా వేసినట్టే కీలకమైన 15 రంగాల్లో ముఖ్యంగా ఎనర్జీ రంగంలో పెట్టుబడులు అత్యధికంగా వచ్చాయి.
మొన్నటి వరకూ జగన్ పాలన అంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారంటూ ఆరోపణలు చేసిన తెలుగుదేశం ఇప్పటివరకూ కనీసం స్పందించలేదు. విశాఖ సదస్సులో పారిశ్రామిక వేత్తలే స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌పై ప్రశంసలు కురిపించారు. జే అంటే జగన్, జే అంటే జోష్ అని చెప్పడం విశేషం. దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేష్ అంబానీ, జగన్ మధ్య సాన్నిహత్యం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇప్పటికీ ఇదే అంశంపై మీడియాలో చర్చ నడుస్తోంది. ముకేష్, జగన్ మధ్య అంత సాన్నిహిత్యం ఎలా, ఎప్పట్నించి అనేది అర్ధం కావడం లేదు.
ఎన్నికల వేళ గేమ్ ఛేంజర్ కానుందా
ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపధ్యంలో కచ్చితంగా ఇది జగన్ ప్రభుత్వానికి ఓ గేమ్ ఛేంజర్ కానుంది. అయితే సమ్మిట్‌లో ప్రకటించిన 13 లక్షల కోట్ల పెట్టుబడుల్లో అత్యధిక శాతం గ్రౌండింగ్ అయ్యేట్టు చూసుకోవడంలోనే అసలు విజయం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు హయాంలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు ఎంవోయూలు జరిగినా గ్రౌండింగ్ కాలేదు. ఇప్పుడీ పెట్టుబడులు కూడా గ్రౌండింగ్ కాకపోతే తిరిగి విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే నేరుగా కంపెనీ యజమానులు, సీఈవోలు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు కావడంతో అత్యధిక శాతం గ్రౌండింగ్ అవుతాయనేది ప్రభుత్వ ధీమాగా ఉంది. కానీ గ్రౌండింగ్ విషయంలో ఏదీ విఫలం కాకుండా చూసుకుంటే..ఇక జగన్ మార్క్ బిజినెస్‌కు తిరుగుండదు.
Also read: Global Investors Summit 2023: విశాఖ సదస్సులో జగన్ , అంబానీల మధ్య సాన్నిహిత్యంపై సర్వత్రా చర్చ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook