వారం రోజుల నుంచి తెలంగాణలో జీఎస్టీ సోదాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు సినీ, టీవీ ప్రముఖుల ఇళ్లల్లో సోదాలు జరిగనట్లుగా వార్తలు వచ్చాయి. ఐతే జీఎస్టీ అధికారులు నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖ పట్నంలో మొత్తం 23 బృందాలతో పలువురు ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 12 కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ , సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శీతల పానీయాలు తయారు చేస్తున్న ఓ కంపెనీపై అధికారులు దాడి చేశారు. దాదాపు 5 కోట్ల రూపాయల సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ బకాయి ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, విశాఖపట్నంలోని పలు ఎలక్ట్రానిక్ సంస్థలపై దాడులు చేస్తున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ బకాయి ఉన్నట్లు గుర్తించారు. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. అలాగే ఓ ప్లాస్టిక్ పైపుల తయారీ కంపెనీలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా పన్ను ఎగవేసినట్లు గుర్తించారు.
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా జీఎస్టీ తనిఖీలు
తెలుగు చిత్ర పరిశ్రమలో జీఎస్టీ తనిఖీలు ప్రముఖంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే పలువురు సినీ, టీవీ నటులు, యాంకర్ల ఇళ్లపై జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించినట్లుగా వార్తలు వచ్చాయి. ఐతే ఎలాంటి సోదాలు జరగలేదని వారు ప్రకటించారు. సకాలంలో జీఎస్టీ చెల్లిస్తున్నామని చెప్పుకున్నారు. మరోవైపు ఈ రోజు ఓ సినీ నిర్మాణ సంస్థపై జీఎస్టీ అధికారులు సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో బకాయి ఉన్న 60 లక్షల రూపాయలను ఆ సంస్థ తక్షణమే చెల్లించినట్లు సమాచారం.
23 ప్రత్యేక బృందాలుగా సోదాలు
కేంద్ర జీఎస్టీ నిఘా విభాగంతో పాటు... నాలుగు కేంద్ర జీఎస్టీ కమిషనరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది.. 23 ప్రత్యేక బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు. ఈ రోజు రాత్రంతా సోదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.