విశాఖపట్నంలోని మన్యంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమను మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యం ఉందని.. అలాగే పోలీసులు నిర్లక్ష్యం ఉందని తెలుపుతూ శివేరు సోమ బంధువులు కొందరు గిరిజనులతో కలిసి డుంబ్రిగూడ పోలీస్ స్టేషనుపై దాడి చేశారు. పోలీస్ స్టేషను తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. స్టేషను ఆవరణలో ఉన్న డేరాలను తగలబెట్టారు. అలాగే స్టేషను బయట ఉన్న 30 మోటార్ బైకులను కూడా తగలబెట్టారు.
ఆందోళనకారులను అడ్డుకోవాలనుకొనే పోలీసులపై కూడా ఎమ్మెల్యే బంధువులు దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో పోలీసుల నుండి అందిన సమాచారం మేరకు.. విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుండి అదనపు పోలీసు బలగాలను ప్రభుత్వం డుంబ్రిగూడకు పంపిస్తోంది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే బంధువులు, స్థానికులు మృతదేహాలను డుంబ్రిగూడ పోలీస్ స్టేషనుకి తరలించి.. అక్కడే స్టేషను బయట బైఠాయించి తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేయడంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది.
పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పాలని ప్రయత్నిస్తున్నా వారు వినడం లేదు. ఈ క్రమంలో ఇదే ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక కలెక్టరు, ఇతర అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజలను కూడా శాంతియుతంగా మెలగాలని కోరారు. అలాగే రాష్ట్రమంత్రి కళా వెంకటరావుని వెంటనే ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. ఈ రోజు ఉదయం వరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అరకులోనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సోమతో కలిసి ఆయన గ్రామస్తులతో మాట్లాడడానికి వెళ్లారు. కానీ ఆకస్మాత్తుగా 60 మంది మావోయిస్టులు.. ఎమ్మెల్యే వద్దకు వచ్చి రౌండప్ చేశారు. చాలాసేపు మావోయిస్టులకు, కిడారి సర్వేశ్వరరావులకు మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చలు విఫలమవ్వడంతో మావోయిస్టులు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు జరిపారు.