విశాఖలో భారీగా ఐటీ దాడులు ; 50 వాహనాల్లో బయలుదేరిన సిబ్బంది !!

                          

Last Updated : Oct 25, 2018, 11:46 AM IST
విశాఖలో భారీగా ఐటీ దాడులు ; 50 వాహనాల్లో బయలుదేరిన సిబ్బంది !!

విశాఖపట్నం: ఊహించినట్లుగానే విశాఖ నగరంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి హోటల్ రూంలో బసచేసిన ఐటీ అధికారులు ఉదయం బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. ఎంవీపీ కాలనీలోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి సుమారు 50 వాహనాల్లో తనిఖీ బృందాలు బయలుదేరినట్లు మీడియాలో కథనాలు వెలవుడుతున్నాయి. ప్రముఖ మీడియా కథనం ప్రకారం గాజువాక మండలం దువ్వాడ ఎస్ఈజెడ్ లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే లాజిస్టిక్‌ రంగంలో భారీ కంపెనీగా ఉన్న టీజీఐలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ సంస్థ టీడీపీ చెందిన ఓ ప్రముఖ నేతకు సంబంధించినదిగా తెలుస్తోంది.

సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న సంస్థలు, రియల్ ఎస్టేట్, దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్మాణపనులు చేస్తున్న కాంట్రాక్టర్లు తదితర రంగాలకు చెందిన వారినే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. విశాఖ నగరంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కొందరు పన్ను సరిగా చెల్లించడం లేదన్న సమాచారం మేరకు ఐటీ శాఖాధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం రావడంతో ఐటీ అధికారులు ఈ సంస్థపై దృష్టి సారించినట్లు సమాచారం. కాగా తాజా ఐటీ దాడులతో వ్యాపార వర్గాలతో పాటు పలువురు రాజకీయ నేతల్లో కూడా అలజడి నెలకొంది.
 

Trending News