రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ప్రకటించారు. కోస్తాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమలోని కర్నూలుతోపాటు తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టంచేసింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా సంబంధిత అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ప్రకటించిన సమాచారం ప్రకారం.. విశాఖపట్నం జిల్లాలో మాడుగుల, రావికమతం మండలాలు, విజయనగరం జిల్లాలో వేపాడ మండలం, తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, దేవీపట్నం మండలాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది.