సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మృతి నందమూరి అభిమానులను, సినీ, రాజకీయ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నందమూరి కుటుంబంలో మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నందమూరి హరికృష్ణకు అభిమానుల్లో ఓ గుర్తింపు ఉంది. అలాంటి తమ అభిమాన నటుడు, తాము ఎంతో ఇష్టపడే అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం నందమూరి అభిమానులకు షాక్‌కి గురిచేసింది. అన్నింటికిమించి హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషాదం నుంచి ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో మరో రోడ్డు ప్రమాదం ఈసారి ఆయన్నే బలిగొనడం నందమూరి అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. అయితే, ఇంతకీ ఈ రోడ్డు ప్రమాదం నందమూరి హరికృష్ణను బలితీసుకునేందుకు బలమైన కారణం ఏంటా అని ఆరాతీస్తే, కారు అధిక వేగంతో నడపడమేనని తెలుస్తోంది.
నందమూరి హరికృష్ణ స్వయంగా నడుపుతున్న ఫార్చునర్ ఏపీ 28 BW2323 నెంబర్ గల కారు నార్కెట్ పల్లి నుంచి అద్దంకి వైపు వెళ్లే రహదారిపై నల్గొండ టౌన్‌కు సమీపంలోని అన్నెపర్తి వద్దకు చేరుకుంది. ఆ సమయంలో కారు 160 కి.మీ అతివేగంతో ప్రయాణిస్తున్న సమాచారం. పైగా నందమూరి హరికృష్ణ సీటు బెల్టు ధరించలేదు. ఆ సమయంలో అనుకోకుండా ప్రమాదవశాత్తుగా డివైడర్ని ఢీకొట్టిన హరికృష్ణ కారు అమాంతం గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతూ డివైడర్‌కి అవతలి వైపు పడింది. సీటు బెల్టు ధరించకపోవడంతో హరికృష్ణ తలకు, ఛాతికి స్టీరింగ్ తగిలి బలమైన గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ అపస్మారక స్థితిలోకి జారుకుంటున్న హరికృష్ణను సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆయన్ని బతికించుకునేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అలా నందమూరి హరికృష్ణను ఓ రోడ్డు ప్రమాదం ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరం చేసింది.