PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో సర్వం సిద్దమైంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు హాజరవుతున్నారు ప్రధాని మోడీ.ప్రధాని పర్యటన ఏపీ అధికారుల్లో హైటెన్షన్ పుట్టిస్తోంది. విజయవాడతో పాటు భీమవరంలో చిరు జల్లులు కురుస్తున్నాయి. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమవరానికి హెలికాప్టర్ లో వెళతారు ప్రధాని మోడీ. హెలికాఫ్టర్ లో వెళ్లడానికి వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గానా వెళ్లే అవకాశం ఉంది. దీంతో కాన్వాయ్ తో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే గన్నవరం- భీమవరం ధారిలో హనుమాన్ జంక్షన్ బైపాస్ లో వంతెన దెబ్బతిన్నది. ఈ మార్గంలోనే మోడీ కాన్వాయ్ వెళ్లాల్సి ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లడానికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతున్నారు అధికారులు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా అల్లూరి జయంతి వేడుకలను భీమవరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సీతారామారాజు 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. అనంతరం పెదఅమిరం గ్రామంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని మోడీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ తో మంత్రులు పాల్గొంటారు. విగ్రహం ఆవిష్కరణ తర్వాత మన్యం వీరుడు అల్లూరి కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు ప్రధాని మోడీ. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.
30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని భీమవరం ఏఎస్‌ఆర్ నగర్ మునిసిపల్ పార్క్‌లో అల్లూరి విగహ్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 3 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. అల్లూరి విగ్రహం బరువు 15 టన్నులు.కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అల్లూరి జయంతి వేడుకలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ప్రధాని మోడీ పాల్గొంటున్న అలూరి సీతారామారాజు జయంతి వేడుకలకు చిరంజీవి హాజరవుతుండగా.. పవన్ కల్యాణ్ మాత్రం రావడం లేదు. జనసేన ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. టీడీపీ నుంచి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు.
ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భీమవరం పట్టణంతో పాటు పెద అమిరం పరిసర ప్రాంతాలు ఎస్పీజీ ఆధీనంలో ఉన్నాయి. ప్రధాని పర్యటన కోసం నాలుగు హెలిపాడ్లను ఏర్పాటు చేశారు. భీమవరం నుంచి ఉండి, గణపవరం, చేబ్రోలు, ఏలూరు, గన్నవరం వరకు రహదారి వెంబడి 2 వేల మంది పోలీసులను మోహరించారు.
Read also: Heavy Rains: తెలంగాణలో జోరుగా వానలు.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ లో కుండపోత
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి