వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈ అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న 48 గంటలపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరుపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. ముఖ్యంగా తీరంవెంట పశ్చిమ దిశగా... గంటకు 45 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఈదురు గాలుల ప్రభావం కారణంగా ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇదిలాఉంటే, ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా గోదావరిలోకి వస్తోన్న వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఈ వర్షాల కారణంగా వరద తీవ్రత అధికమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.