నిందితుడు శ్రీనివాస్ బెయిల్‌పై హైకోర్టు కీలక నిర్ణయం

నిందితుడు శ్రీనివాస్ బెయిల్‌పై హైకోర్టు కీలక నిర్ణయం

Last Updated : Jul 19, 2019, 07:15 PM IST
నిందితుడు శ్రీనివాస్ బెయిల్‌పై హైకోర్టు కీలక నిర్ణయం

విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ఉండగా ఆయనపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌కు ఎన్ఐఏ కోర్టు జారీచేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గతేడాది అక్టోబర్ 25న జరిగిన ఈ దాడి కేసును తొలుత ఏపీ పోలీసులు దర్యాప్తు చేపట్టగా అనంతరం వారి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తునకు స్వీకరించింది. కేంద్ర భద్రతా బలగాలు రక్షణ కల్పించి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో సేవలు అందించే విమానాశ్రయం ప్రాంగణంలో దాడి జరిగినందువల్లే ఎన్ఐఏ ఈ కేసును విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే.

విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్‌కు ఈ ఏడాది మే 22న బెయిల్ మంజూరు చేయగా.. ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్‌కి బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు పూర్తికానందున నిందితుడి బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వతరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తిచేశారు. జగన్‌పై జరిగిన దాడి పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ చట్టంలోని సెక్షన్‌ 6ఏ ప్రకారం బెయిల్‌ మంజూరుకు సరైన కారణాలు చెప్పాలనీ, అయితే దీన్ని దిగువకోర్టు పట్టించుకోలేదని న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

అయితే, అదే సమయంలో శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వడాన్ని సమర్దిస్తూ శ్రీనివాస్ తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు శ్రీనివాస్ బెయిల్‌ను రద్దుచేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ కేసులో నిందితుడు తమ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు కోర్టు స్పష్టంచేసింది.

Trending News