కృష్ణా జిల్లా పెడనలో స్థానికంగా టీడీపీ రాష్ట్ర, జిల్లా కార్యక్రమాలను బహిష్కరించాలని టీడీపీ పట్టణ కమిటీ ప్రకటించింది. పెడనకు చెందిన పార్టీ సీనియర్ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాల రావు నేతృత్వంలో శుక్రవారం రాత్రి జరిగిన పార్టీ సమావేశంలో టీడీపీ స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు ఈ నిర్ణయిం తీసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగేళ్ల నుంచీ బొడ్డు వేణుగోపాల రావు నామినేటెడ్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ నాయకుడికి నామినేటెడ్ పదవి ఇస్తే, స్థానికంగా పార్టీ మరింత అభివృద్ధి చెందుతుందని కోరుతూ ప్రత్యేకంగా ఓ కమిటీగా ఏర్పడిన స్థానిక నేతల బృందం సైతం పలుసార్లు మంత్రులు, జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిసి మొరపెట్టుకున్నారు.
అయితే, తనకు నామినేటెడ్ పదవి ఇవ్వాలన్న డిమాండ్లను, విజ్ఞప్తులని పార్టీ సీనియర్లు పెడచెవిన పెట్టడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బొడ్డు వేణుగోపాల రావు శుక్రవారం రాత్రి సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం ఎంత కృషి చేసినా ఫలితం లేనప్పుడు, ఇక పార్టీ కోసం పనిచేయడం అనవసరం అని భావిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు పెడన టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.