కాపు రిజర్వేషన్లపై టీడీపీ ఎంపీ ప్రైవేటు మెంబర్ బిల్లు..!

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈ రోజు లోక్ సభలో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశబెట్టారు. 

Last Updated : Aug 3, 2018, 07:51 PM IST
కాపు రిజర్వేషన్లపై టీడీపీ ఎంపీ ప్రైవేటు మెంబర్ బిల్లు..!

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈ రోజు లోక్ సభలో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశబెట్టారు. ఇప్పటికే ఈ రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపులను తమిళనాడు తరహాలో షెడ్యూల్ 9లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. విద్య, ఉద్యోగం లాంటి విషయాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని తెలిపింది. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈ రోజు ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశపెట్టడంతో ఆ అంశంపై మళ్లీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ బిల్లును ప్రవేశపెడుతూ అవంతి శ్రీనివాస్ పార్లమెంటులో మాట్లాడారు.

అయితే ఈ బిల్లుపై ఎప్పుడు చర్చ జరగాలి.. ఈ చర్చకు ఎంత సమయం కేటాయించాలి అనే విషయంపై వచ్చేవారం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ విధమైన ప్రైవేటు మెంబరు బిల్లులు ప్రవేశపెట్టడం ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు కొత్తేమీ కాదు. గత సంవత్సరం ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి కూడా గతంలో శాసనసభ్యుల అనర్హతకు సంబంధించిన ఆర్టికల్‌ 102, 191లకు సవరణలు ప్రతిపాదిస్తూ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. 

అయితే ఈ మధ్యకాలంలో కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. తాజాగా అదే అంశంపై ప్రవేశబెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రాధాన్యతను సంతరించుకుంది. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తాము అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌కు ప్రతి సంవత్సరం రూ.2 వేలకోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.10 వేల కోట్ల నిధులు అందిస్తామని తెలిపారు. అంతకు క్రితమే ఆయన ఇదే విషయంపై మాట్లాడుతూ..ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని విషయం అని.. తాము ఏమీ చేయలేమని తెలిపారు. 

Trending News