గన్నవరం: కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న టీడీపీ యువనేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అందరికీ ఊహించని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయ పార్టీ మారుతున్నారనే ప్రచారం జరగడంతో బీజేపీలోకి కానీ లేదా వైసీపీలో కానీ చేరతారనే టాక్ బలంగా వినిపించింది. కిందటి వారంలో వరుసగా బుధ, గురువారాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన వల్లభనేని వంశీ.. ఆ తర్వాత బీజేపి ఎంపీ సుజనా చౌదరి, ఆ తరవాత సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అవడమే అందుకు కారణమైంది. కానీ వంశీ మాత్రం అందరి అంచనాలకు భిన్నంగా ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.
వైసిపి నేతల వేధింపులు, స్థానిక అధికారుల పక్షపాతధోరణి వల్ల తాను, తన అనుచరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తన కోసం వచ్చిన అనుచరులు తన కారణంగానే ఇబ్బంది పడటం చూడలేకపోతున్నానని వల్లభనేని వంశీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించిన రాజీనామా లేఖలో వంశీ తన ఆవేదనంతా వెళ్లగక్కారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటేనైనా తన కోసం తాపత్రయపడే తన అనుచరులకు ఇబ్బందులు తొలగిపోతాయేమోనని వంశీ అభిప్రాయపడ్డారు. తాను ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మరో మార్గం ఉన్నప్పటికీ.. ఆ మార్గాన్ని అనుసరించడం ఇష్టం లేకే చివరకు రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు వంశీ తన లేఖ ద్వారా వెల్లడించిన తీరు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనియాంశమైంది.