తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తూర్పు నుంచి వీస్తున్న చల్లని గాలుల కారణంగా.. ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి పెరిగిన కారణంగా జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

Last Updated : Dec 18, 2019, 06:35 PM IST
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తూర్పు నుంచి వీస్తున్న చల్లని గాలుల కారణంగా.. ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి పెరిగిన కారణంగా జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటలు దాటే వరకు సూర్యుని జాడ కనిపించడం లేదు. విజుబులిటీ పూర్తిగా తగ్గిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.  ఉదయం 9, 10 గంటల తర్వాతే... ప్రజలు మెల్లగా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పనులు ఉన్న వారు.. స్వెట్టర్లు, చలి కోట్లు ధరించి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్నారు. ఉదయం పూట వ్యాయమానికి వెళ్లే వారు కూడా చలికి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు.

చలి మంటలే శరణ్యం...
చాలా గ్రామాల్లో రైతులు పొలం పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. గ్రామాల్లో చలిమంటలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని సంగారెడ్డిలో అత్యల్పంగా 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఆంధ్రా కాశ్మీర్ విశాఖ జిల్లాలోని లంబసింగిలో ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఎక్కడ చూసినా పొగ మంచుతో కనిపిస్తోన్న వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది.  

ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రత..
తెలంగాణలోని ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో కనిష్టంగా 5 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని  వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మెదక్, రామగుండం, నిజామాబాద్‌లో తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి...
ఉత్తర భారతాన్ని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్, బీహార్, హర్యానా, చంఢీఘడ్, రాజస్థాన్ ప్రాంతాల్లో దట్టంగా పొగ మంచు కనిపిస్తోంది. దీంతో విజుబులిటీ పూర్తిగా తగ్గిపోయింది. ఉదయంపూట బయటకు రావాలంటేనే జనం భయంతో వణికిపోతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఢిల్లీలో ఇవాళ ఉదయం 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Trending News