ఆంధ్రా పాలిటిక్స్‌లోనూ వేలు పెడతాం... చంద్రబాబూ ఇక కాస్కో : కేటీఆర్

తెలంగాణ పాలిటిక్స్‌లో వేలు పెట్టిన చంద్రబాబుకు మేమేంటో చూపిస్తాం : కేటీఆర్

Last Updated : Dec 2, 2018, 12:26 PM IST
ఆంధ్రా పాలిటిక్స్‌లోనూ వేలు పెడతాం... చంద్రబాబూ ఇక కాస్కో : కేటీఆర్

హైదరాబాద్ : ఇప్పటికే తనదైన శైలితో ఆంధ్రాలోనూ పలుచోట్ల అభిమానులను సంపాదించుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రానున్న రోజుల్లో ఆంధ్రాలోనూ రాజకీయంగా పార్టీలను ప్రభావితం చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శనివారం నాడు హైదరాబాద్‌లోని భరత్ నగర్‌లో జరిగిన మన హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఓ సవాల్ విసరడమే ఈ సందేహాలకు కారణమైంది. రానున్న రోజుల్లో రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేందుకు టీఆర్ఎస్ వెనుకాడబోదని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా అవసరమైతే ఆంధ్రాలోనూ వేలు పెట్టేందుకు సిద్ధమేనని కేటీఆర్ చేసిన ప్రకటన రాజకీయవర్గాల్లో చర్చనియాంశమైంది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబును ఇప్పటికే అమరావతి దాకా తరిమికొట్టిన కేసీఆర్.. సరైన సమయంలో సరైన రీతిలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మన హైదరాబాద్ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మహాకూటమిలో రాహుల్ గాంధీ సీట్లు పంచొచ్చు.. చంద్రబాబు కోట్లు పంచొచ్చేమో కానీ ఓట్లు వేసేది మాత్రం మనవాళ్లే కనుక మీరు మీ ఓటు హక్కుతో కూటమికి తగిన బుద్ధి చెప్పాలని కేటీఆర్  పిలుపునిచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌తో తాము ఏనాడూ గొడవలు పెట్టుకోలేదు.. ఏనాడు తగాదాలు కోరుకోలేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టాడు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో చంద్రబాబు చూస్తారు. అవసరమైతే రాబోయే రోజుల్లో రాజకీయంగా చంద్రబాబు అంతు చూడటానికైనా సిద్ధమేనని కేటీఆర్ సవాల్ విసిరారు. 

Trending News