ఆంధ్రప్రదేశ్ సీఐడీ అడిషనల్ డీజీ పీవి సునీల్ కుమార్‌పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. సీఐడీను దుర్వినియోగం చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పుడిక త్వరలో ఆయనపై చర్యలు తప్పవని తెలుస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవల్సిందిగా ఏకంగా కేంద్ర హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి సూచించడమే ఇందుకు కారణం.
కేంద్ర హోంశాఖకు చేసిన ఫిర్యాదు సారాంశం ఇదీ
ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న గూడపాటి లక్ష్మీ నారాయణ గత ఏడాది అక్టోబర్ 17వ తేదీన కేంద్ర హోంశాఖకు ఓ లేఖ రాశారు. ఏపీ సీఐడీ అడిషనల్ డిజీ పీవి సునీల్ కుమార్ ఆకృత్యాలు, దౌర్జన్యాలను ఆయన లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఒకరిని అరెస్టు చేయడం, కస్టడీలో తీసుకోవడం విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పీవీ సునీల్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని లక్ష్మీ నారాయణ ఫిర్యాదు చేశారు. పీవీ సునీల్ కుమార్ వంటి కళంకిత అధికార్లతో ఏపీ సీఐడీ నిండిపోయందని ఆయన ఆరోపించారు.
ఏపీ సీఐడీ అధికారి పీవి సునీల్ కుమార్ అధికార దుర్వినియోగం విషంయంలో పెనుమాక సుబ్బారావు ఏపీ హైకోర్టులో రిట్ పిటీషన్ నెంబర్ 5176/22 దాఖలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా..సుబ్బారావు కుటుంబ సభ్యుల్ని భౌతికంగా, మానసికంగా వేధించారని పిటీషన్లో ఉందన్నారు. తప్పుడు కేసులు బనాయించడం, కస్టడీలో వేధించడం వంటివి పీవి సునీల్ కుమార్‌కు అలవాటుగా మారిందని హైకోర్టు న్యాయవాది లక్ష్మీ నారాయణ ఫిర్యాదు చేశారు.
సీఐడీ పోలీసులు తామెవరో చెప్పుండా బాధితుల ఇళ్లలో వేళ కాని వేళ చొరబడటం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 41 ఏ నోటీసు జారీ చేయకపోవడం, సీసీటీవీ కెమేరాల్లేకుండా బాధితుల్ని కస్టడీలో వేధించడం, బాధితుల కుటుంబసభ్యుల్ని బెదిరించడం, సూర్యాస్తమయం తరువాత సూర్యోదయం కంటే ముందు బాధితుల్ని అరెస్టు చేయడం వంటి ఉల్లంఘనల్ని లక్ష్మీ నారాయణ తన ఫిర్యాదులో ప్రస్తావించారు.
2019 నుంచి ఏపీ సీఐడీ అధికారులు కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే తప్ప ఛార్జిషీటు దాఖలు చేయడం లేదని లక్ష్మీ నారాయణ ఫిర్యాదులో ప్రస్తావించారు. సీఐడీ ఏపీ పౌరుల్ని ఎలా వేధిస్తుందో చెప్పేందుకు ఇది చాలన్నారు. పౌరుల ప్రాధమిక హక్కుల్ని ఏపీ సీఐడీ అధికారి పీవి సునీల్ కుమార్ కాలరాస్తున్నారని ఫిర్యాదు చేశారు.
క్రిమినల్ చట్టాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటూ టార్గెట్ చేసినవారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సీఐడీ అధికారి పీవి సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని లక్ష్మీ నారాయణ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపధ్యంలో ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్‌పై తగిన చర్యలు తీసుకుని..ప్రజల ప్రాధమిక హక్కుల్ని పరిరక్షించాలని హైకోర్టు న్యాయవాది లక్ష్మీ నారాయణ కోరారు.
స్పందించిన కేంద్ర హోంశాఖ
ఏపీ హైకోర్టు న్యాయవాది లక్ష్మీ నారాయణ రాసిన లేఖపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ స్పందించారు. ఆయన రాసిన ఫిర్యాదును ఏపీ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీకు ఫార్వార్డ్ చేశారు. ఏపీ సీఐడీ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి ఈ లేఖను కేంద్ర హోంశాఖ ఫిబ్రవరి 3వ తేదీనే..ఏపీ ఛీఫ్ సెక్రటరీకు రాసింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ లేఖ సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. సీఐడీ అధికారి పీవి సునీల్ కుమార్‌పై చర్యలు తప్పవని తెలుస్తోంది.
Also read: Summer Effect: ఆందోళన కల్గిస్తున్న వేసవి అంచనాలు, ఎండలు ఠారెత్తనున్నాయా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook