విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తనదైన స్టైల్లో విమర్శించారు. విశాఖలోని గాజువాకలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడుతూ.. పవన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని.. ఆయన నామినేషన్ వేసేటప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాలే కనిపించాయి'' అని చమత్కరించారు. గాజువాక నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్, వైఎస్సార్సీపీ అభ్యర్థి టి నాగిరెడ్డికి మధ్య జరుగుతున్న ఎన్నికల పోటీని ఒక యాక్టర్‌కు-లోకల్ హీరోకు మధ్య పోటీగా జగన్ అభివర్ణించారు.
నాలుగేళ్లపాటు టీడీపీతో కాపురం చేసి, ఒక ఏడాది ముందే విడాకులు తీసుకున్నట్లు పవన్ బిల్డప్ ఇస్తున్నారని జనసేనానిపై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడిన తనపై 22 కేసులు పెట్టారు కానీ పవన్ కళ్యాణ్ మీద కేసులు ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ దోస్తికి ఇంతకన్నా ఎక్కువు రుజువులు అవసరం లేదని జగన్ ముందు నుంచీ ఆరోపిస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే.