గుంటూరు: వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, మూడు దశల్లో మద్యపానాన్ని నిషేధిస్తామని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి మద్యం షాపులు రద్దుచేసిన తర్వాతే ఓట్లు అడగడానికి వస్తామని జగన్ ప్రకటించారు. టిడిపి పరిపాలనలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఓవైపు ఎమ్మెల్యేలే అధికారులపై దాడులకు పాల్పడుతున్నా... వారిపై కేసులు, అరెస్టులు ఏవీ లేవని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే వైఎస్సార్సీపీ అధికారంలోకి శాంతి భద్రతలకే తొలి ప్రాధాన్యతను కల్పిస్తామని.. మహిళలపై వేధింపులకు పాల్పడే వారికి తగిన శిక్షలు వేస్తామని ఆడపడుచులకు జగన్ హామీ ఇచ్చారు.