YS Jagan Fires on CM Chandrababu Naidu: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ దూకుడు పెంచుతున్నారు. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలకు పదునుపెట్టారు. తాజాగా హామీల అమలు గురించి ప్రశ్నిస్తూ.. ట్విట్టర్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత తనది అని చంద్రబాబు అన్నారని.. పైపెచ్చు రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారెంటీ తనదే అని పదేపదే చెప్పారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారని విమర్శించారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని.. ఇది పచ్చిమోసం కాదా..? అని జగన్ ప్రశ్నించారు.
Also Read: Ration Card: తెలంగాణ కొత్త రేషన్ కార్డు కావాలా? అయితే అర్హతలు ఇవే!
చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తొలి క్షణం నుంచే ప్లేటు ఫిరాయించారని ఫైర్ అయ్యారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అప్పులకు వడ్డీలు కట్టాలని.. అవి కట్టడానికే డబ్బుల్లేవంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇవ్వలేదని.. రైతు భరోసాకింద ప్రతి రైతుకు రావాల్సిన రూ.20 వేలు రాలేదన్నారు.
ఫీజు రీఎయింబర్స్‌మెంట్, వసతి దీవెనా లేదు, సున్నావడ్డీ, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు, ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా రూ.3 వేల నిరుద్యోగ భృతి, మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు ఏమైయ్యాయని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంటింటికి పెన్షన్, రేషన్ నిలిచిపోయిందని.. వాలంటీర్లను మోసం చేశారని అన్నారు. విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితిని మళ్లీ తీసుకువచ్చారని విమర్శించారు.
రాష్ట్రంలో లా అండర్ ఆర్డర్ పూర్తిగా గాడితప్పిందన్న జగన్.. రెడ్‌బుక్ రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మూడు హత్యలు, ఆరు విధ్వంసాలుగా వర్ధిల్లుతోందంటూ సెటైర్లు వేశారు. మహిళలకు రక్షణే లేదని.. దిశ యాప్ అటకెక్కిందన్నారు. రెండున్నర నెలల్లోనే ప్రజలను ఇంతలా దగా చేస్తారా చంద్రబాబూ..? అని నిలదీశారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్లమేర రాష్ట్రం అప్పులపాలైందని చెప్పారని.. ఇప్పుడు రూ.10 లక్షల కోట్లు అంటున్నారని అన్నారు.
అయితే జూన్ 2024 నాటికి ఉన్న మొత్తం అప్పులు అక్షరాల రూ.7,48,612 కోట్లు అని.. ఇందులో 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.4,08,170 కోట్లు అని లెక్కలు చెప్పారు. దీనిపైన ఉన్నవి మాత్రమే తమ హయంలో చేసిన అప్పులు అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు, ఆర్బీఐ నివేదికలు, కాగ్ లెక్కల్లాంటి ఆధారాలతో కూడిన సమగ్ర వివరాలు ఈ లింక్ https://bit.ly/4dkOKru లో ఉన్నాయని.. జాగ్రత్తగా చదువుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఇకనైనా రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలను ఆపేయాలని.. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను తు.చ. తప్పక అమలు చేయాలని హితవు పలికారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.