Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy On Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఏడాది మే వరకు సమయం ఉందని.. చివరి రోజు వరకు సేవ చేస్తామని అన్నారు. గడవును పూర్తిగా వినియోగించుకుంటామని చెప్పారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 7, 2023, 07:10 AM IST
Early Elections In AP: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy On Early Elections: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారానికి చెక్ పడింది. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రజాతీర్పును గౌరవించి.. ఐదేళ్లు పరిపాలిస్తామని చెప్పారు. గడువును పూర్తిగా వినియోగించుకుని.. ప్రజలకు చివరి రోజు వరకు సేవ చేస్తామన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి పాజిటివ్ ఓటింగ్‌ విశ్వాసం ఉందని.. చేసేదే చెబుతున్నాం.. చెప్పిందే చేస్తున్నామని అన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామని.. ప్రతి చోటా తమను విశేషంగా ఆదరిస్తున్నారని చెప్పారు. 

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలపై ప్రతిదీ వెల్లడిస్తున్నామని.. ఆయన పర్యటనల ఫలితాలు కూడా స్వయంగా చూస్తున్నామని సజ్జల అన్నారు. కేంద్రం నుంచి రావాల్సివన్నీ అడుగుతున్నారని.. అయినా ఏవేవో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి చీకట్లో ఏదో చేసి వచ్చే వారని.. కానీ సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, ఎవరిని కలిసినా చాలా స్పష్టతతో ఉంటున్నారని అన్నారు. సీఎం వెళ్లి మాట్లాడి వచ్చిన తరువాత మంత్రులు, అధికారులు ఫాలోఅప్‌ చేస్తున్నారని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాలు దక్కుతున్నాయని పేర్కొన్నారు.

మళ్లీ గెలవడం కష్టం అనుకున్నవాళ్లు.. ప్రత్యర్థులు పుంజుకోక ముందే ఎలాగోలా ఎన్నికల్లో గెలవాలనుకునే వారు ముందస్తు ఎన్నికలకు వెళతారని అన్నారు. గతంలో చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతితో గెలవాలని ప్రయత్నించారని గుర్తుచేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆ సెక్షన్‌ ఆఫ్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. వాళ్లు సర్దుకోవడానికో లేదా కేడర్‌లో ఊపు తీసుకు రావడానికో ఏమో అని అన్నారు. పవన్ ‌కళ్యాణ్‌ను పూర్తిగా తన జట్టు లోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు వచ్చే ఏడాది మే నెల వరకు సమయం ఉందని.. ఈలోపు చంద్రబాబు పొత్తుల ప్రయత్నాలు చేసుకోవచ్చన్నారు. 

అమరావతిలో పేదల ఇళ్లకు కేంద్రం నిధులపై షరతు కొత్తది కాదని.. అది గతంలో కూడా ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకే తమ వాటా నిధులు ఖర్చు చేస్తున్నామని.. అయితే వారికి వచ్చిన అభ్యంతరం ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు నిర్మించవద్దని ఎవరూ చెప్పలేదని.. ఆ హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ఎక్కడైనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే కోర్టులు స్పందిస్తాయని.. కానీ పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వొద్దని కోర్టులు కూడా ఎలా చెబుతాయి..? అని ప్రశ్నించారు. 

రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై సజ్జల స్పందిస్తూ.. పురంధేశ్వరికి పదవి ఇవ్వడంపై తమ పార్టీ ప్రమేయం ఉందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ అనేది ఒక పెద్ద పార్టీ అని.. అది వాళ్ల నిర్ణయం అని అన్నారు. తమకు సంబంధించినంత వరకు అది ఆ పార్టీ వ్యవహారం అని.. తమకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. తాము ఎప్పుడూ ఆ కోణంలో ఆలోచించబోమని.. ఆ పని చంద్రబాబు చేస్తారని అన్నారు. 

Also Read: Tamim Iqbal Retirement: తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై  

Also Read: New Releases This Weekend on OTT: ఓటిటిలో ఈ వారం కొత్త సినిమాలు.. నాన్-స్టాప్ ఫన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News