రేపే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న వైఎస్సార్సీపీ

రేపు శుక్రవారం, అంటే మార్చి 16న పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న వైఎస్సార్సీపీ అందుకోసం మద్ధతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమై వుంది.

Last Updated : Mar 15, 2018, 06:51 PM IST
రేపే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న వైఎస్సార్సీపీ

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లోపల, వెలుపల పోరాటం చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తోన్న వైఎస్సార్సీపీ అంతిమంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. వైఎస్సార్పీసీ అధినేత వైఎస్ జగన్ సూచనల మేరకు రేపు శుక్రవారం, అంటే మార్చి 16న పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న వైఎస్సార్సీపీ అందుకోసం మద్ధతు కూడగట్టుకునే పనిలో నిమగ్నమై వుంది. కేంద్రంపై తాము కొనసాగిస్తున్న పోరాటంలో తమకు అండగా నిలవాల్సిందిగా కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు టీడీపీ, టీఆర్ఎస్‌తోపాటు పలు ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలు, ఎంపీలను కోరుతున్నారు. ఆఖరికి బీజేపీ ఎంపీలు భారతిహరి మెహతాబ్‌ని సైతం కలిసిన వైఎస్సార్సీపీ నేతలు.. ఈ అవిశ్వాస తీర్మానంలో తమకు అండగా నిలవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేశారు. 

టీడీపీ ఎంపీ తోట నర్సింహం, టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి వంటి నేతలు వైఎస్సార్సీపీ ఎంపీలు కలిసిన వారిలో వున్నారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగినంత కాలం ప్రత్యేక హోదా కోసం పోరాడి, ఆ తర్వాత తమ ఎంపీ పదవులకు సైతం రాజీనామా చేయాలనే యోచనలో బీజేపీ వుంది. 

ఢిల్లీలో పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో భేటీ అయిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి.. "మరుగున పడింది అనుకున్న ఏపీకి ప్రత్యేక హోదా అంశం కేవలం వైఎస్సార్సీపీ చేసిన నిరంతర పోరాటం వల్లే మళ్లీ తెరపైకొచ్చింది" అని అన్నారు. గురువారం పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ నినాదాలు చేసిన ఆ పార్టీ ఎంపీలు.. అనంతరం సభలో తమ నిరసన తెలిపారు. 

Trending News