Interest Rates Increased: పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ స్కీమ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి పొదుపు పథకాలపై ఏప్రిల్ - జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. పీపీఎఫ్ పై వడ్డీ రేటును 7.1 శాతం, సేవింగ్స్ డిపాజిట్స్ పై 4 శాతంలో ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అలాగే కొనసాగించిన కేంద్రం.. ముందు చెప్పుకున్న అన్ని పొదుపు పథకాలపై 0.1 శాతం నుంచి 0.7 శాతం వరకు పెంచినట్టు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ఈ పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) పై అత్యధికంగా .5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెరిగింది. అంటే గతంలో 7 శాతంగా ఉన్న వడ్డీ రేటు ఇప్పుడు 7.5 శాతానికి పెరిగింది. బాలికల ఆర్థిక సంరక్షణ కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన పథకంపై ఇప్పటి వరకు 7.6 శాతంగా ఉన్న వడ్డీ రేటును ఇప్పుడు 8 శాతం చేశారు. అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పై ఇప్పటి వరకు 8 శాతంగా ఉన్న వడ్డీ రేటును ఇప్పుడు 8.2 శాతానికి పెంచారు.
కిసాన్ వికాస్ పత్రపై ఇప్పటివరకు 7.2 శాతంగా ఉన్న వడ్డీ రేటును 7.6 శాతానికి పెంచారు. కిసాన్ వికాస్ పత్ర కాల వ్యవధిలో మార్పులు తీసుకొచ్చారు. ఇదివరకు 120 నెలల మెచ్యురిటీ పీరియడ్ గా ఉన్న కాలవ్యవధిని ఇప్పుడు 5 నెలలు తగ్గించి 115 నెలలకు కుదించారు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను సమీక్షించి, సవరిస్తున్న సంగతి తెలిసిందే. గత త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగిన విషయం విదితమే.