Facial Recognition System: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక బోర్డింగ్ పాస్ లేకుండానే ఎయిర్ పోర్టులోకి వెళ్లిపోవచ్చు. గురువారం నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంతో పాటు బెంగళూరు, వారణాసి విమానాశ్రయాలలో నేటి నుంచి ప్రవేశ నియమాలు మారాయి. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగా విమాన ప్రయాణికులకు ప్రవేశం కల్పించే సదుపాయం 'డిజి యాత్ర' యాప్‌ను ప్రారంభించారు. డిజి యాత్ర ద్వారా ప్రయాణికులకు విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్ అవసరం లేదు.
కొత్త నిబంధన ప్రకారం.. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు పేపర్‌లెస్ ఎంట్రీ పొందుతారు. ఫేస్ గుర్తింపు ద్వారా వివిధ చెక్ పాయింట్‌లలో ప్రయాణికుల వివరాలు ఆటోమేటిక్‌గా వెరీఫై అయిపోతాయి. భద్రతా తనిఖీ ప్రాంతాలలో కూడా అదే వ్యవస్థ పని చేస్తుంది. ఢిల్లీతో పాటు వారణాసి, బెంగళూరు విమానాశ్రయాల్లో ఈ సదుపాయాన్ని గురువారం నుంచే ప్రారంభించారు. ఈ సదుపాయం కోసం ప్రయాణికులు 'డిజి యాత్ర' యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.
విమానాశ్రయంలోకి ప్రవేశం ఈ-గేట్
'డిజి యాత్ర'యాప్‌లో ఆధార్ ద్వారా వివరాలు ధృవీకరించుకోవాలి. ప్రయాణికులు ఫొటోను కూడా తీసుకోవాలి. విమానాశ్రయం ఈ-గేట్ వద్ద ప్రయాణికులు ముందుగా బార్ కోడెడ్ బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయాలి. దీని తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన 'ఫేషియల్ రికగ్నిషన్' సిస్టమ్ ప్రయాణికుల గుర్తింపు, టికెట్‌ను ధృవీకరిస్తుంది. ఈ ప్రక్రియ తర్వాత ప్రయాణికులు ఈ-గేట్ ద్వారా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు.
డిజి యాత్ర యాప్‌లో వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత.. ఆధార్ నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇది ఓటీపీ ద్వారా జరుగుతుంది. ఆ తరువాత మీరు ఎప్పుడు ప్రయాణించినా.. వెబ్ చెక్-ఇన్ తర్వాత యాప్‌లో మీ టిక్కెట్‌ను అప్‌లోడ్ చేయాలి. విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత.. మీరు మీ టిక్కెట్‌ను స్కానర్‌లో ఉంచి.. మీ ముఖాన్ని స్కాన్ చేయాలి. ఆ తరువాత మీకు ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ లభిస్తుంది.
విమానాశ్రయ ప్రవేశ ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ డిజియాత్ర యాప్ ముఖ్య ఉద్దేశం. విమానాశ్రయంలోకి వెళ్లేప్పుడు క్యూ పెద్దగా ఉండడంతో లోపలికి ప్రవేశించేందుకు చాలా సమయం పడుతోంది. 'ఫేషియల్ రికగ్నిషన్' సిస్టమ్‌తో క్యూల నుంచి ఉపశమనం లభించనుంది. అంతేకాకుండా ప్రయాణికులు హార్డ్ కాపీలను తీసుకెళ్లే పనికూడా తప్పుతుంది. డిజిటల్‌గా సులభంగా నమోదు వివరాలు నమోదు చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook