మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి నటించిన చిత్రం.. 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ సినిమా ఇప్పుడు 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సారథ్యంలోని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా 1990 మే 9న విడుదలైంది. అప్పట్లోనే ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇవాళ్టికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంద్రుని కుమార్తె భూలోకానికి వస్తే.. ఎలా ఉంటుంది..? ఆమె ఉంగరం కోల్పోయి.. తిరిగి ఇంద్రలోకానికి వెళ్లకుండా ఉంటే జరిగే పరిణామాలు ఏంటి..? అన్న రచయిత శ్రీనివాస చక్రవర్తి ఆలోచనే చిత్ర కథాంశం. ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్ర రావు, ప్రముఖ కథా రచయితలు యండమూరి వీరేంద్ర నాథ్, జంధ్యాల, క్రేజీ మోహన్, సత్యానంద్ కూర్చుని చిత్ర కథను తయారు చేశారు. దీంతో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం సోషియో ఫాంటసీ చిత్రంగా రూపుదిద్దుకుంది.
మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. చిత్రంలో సోషియో ఫాంటసీతోపాటు కామెడీ, రొమాన్స్, యాక్షన్ సమపాళ్లలో కుదిరాయి. మెగాస్టార్ చిరు, శ్రీదేవి.. టైటిల్ కు తగ్గట్టుగానే తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బాణీలు సమకూర్చారు. వేటూరి సుందర రామమూర్తి రాసిన గీతాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'అబ్బ నీ తీయని దెబ్బ'.. పాట ప్రేక్షకులను అలరించింది.
'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం.. 30 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆనాటి సినిమా గురించి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Magic can not be planned. It just happens! When Magic happens on celluloid, it leaves lasting memories and ever lasting happiness! #JagadekaVeeruduAthilokaSundari @VyjayanthiFilms @Ragavendraraoba #Sridevi #Ilaiyaraaja @SwapnaDuttCh #JVAS30Years https://t.co/WgPnZbQ0gt pic.twitter.com/1LoDDn43sB
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2020
'జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్..!!
మరోవైపు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి పని చేసిన టీమ్ అంతా బాగా కుదిరిందని నిర్మాత అశ్వినీదత్ అన్నారు. ఈ సినిమాకు సీక్వెల్ నిర్మించాలన్నది తన కల అని తెలిపారు. దీనికి సంబంధించి వైజయంతీ మూవీస్ టీమ్ వర్క్ చేస్తోందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి పోషించిన పాత్రలను సీక్వెల్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాహ్నవి పోషించే అవకాశం ఉందా..? అంటే అలా జరిగితే బాగుంటుందని అశ్వినీ దత్ అన్నారు.