చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి. నిర్మాత రామ్ చరణ్ తేజ. కొణిదెల ప్రొడక్షన్స్ లో వస్తున్న ఈ చిత్రంలో అమితాబ్, నయనతార, సుదీప్, జగపతిబాబు తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నది ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్. కాగా.. ఈ సినిమా నుండి ఒక్కొక్క సాంకేతిక నిపుణులు తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ స్థానంలో రత్నవేలు ను తీసుకున్నట్లు సమాచారం. తాజాగా "నేను సై రా సినిమా చేయట్లేదు"అన్నాడు ఏఆర్ రెహ్మాన్. హైదరాబాద్ లో ఒక షో లో పాల్గొనడానికి వచ్చిన ఆయన పై విధంగా స్పందించారు. "చిరంజీవి అంటే నాకెంతో ఇష్టం.. నేను ఆయన అభిమానిని కూడా. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా నేను ఈ సినిమా ప్రాజెక్టు చేయటం లేదు" అని అన్నాడు. చిత్ర యూనిట్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తే.. సినిమా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందుతుందని ఆశించారు. కానీ ఆయన ఈ విధంగా స్పందించడంతో ఇప్పుడు ఏ సంగీత దర్శకుడిని తీసుకుంటారో చూడాలి మరి..!!