నష్టాల్లో వున్న నిర్మాతకు అండగా నిలిచిన బాలయ్య బాబు

డోంట్ వర్రీ.. నీకో సినిమా చేస్తాను.. నష్టాల్లో వున్న నిర్మాతతో బాలయ్య బాబు  

Last Updated : Feb 25, 2018, 12:42 AM IST
నష్టాల్లో వున్న నిర్మాతకు అండగా నిలిచిన బాలయ్య బాబు

నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ తనతో సినిమా తీసిన ఓ నిర్మాతను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తాను హీరోగా వచ్చిన జై సింహ సినిమాను నిర్మించిన సి కళ్యాణ్ ఆ సినిమాతో పెద్దగా లాభాలు ఏమీ మూటగట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా సి కళ్యాణ్ నిర్మించిన ఇంటిలిజెంట్ సినిమా కూడా అతడిని నిండా ముంచేసింది. దాదాపు రూ.27 కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించిన ఈ సినిమా నిర్మాతకు రూ. 15 కోట్ల నష్టాన్ని తీసుకొచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వరుసగా నష్టపోయిన సి కళ్యాణ్ ని ఆదుకునేందుకు బాలయ్య బాబు నడుం బిగించినట్టు తెలుస్తోంది.

ఇంటిలిజెంట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలోనే తాను ఓ సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాను అని నిర్మాత సి కళ్యాణ్ కి బాలకృష్ణ హామీ ఇచ్చినట్టు ఓ టాక్ వినిపిస్తోంది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం బాలకృష్ణ-వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన చెన్నకేశవ రెడ్డి సినిమా బాలయ్య బాబు కెరీర్ లో కలెక్షన్స్ బాగా రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. బాలయ్య బాబుకు సీమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి పెట్టిన సినిమాల్లో చెన్నకేశవ రెడ్డి కూడా ఒకటి. వినాయక్ కెరీర్ లో ఎన్టీఆర్ తో ఆది మొదటి సినిమా కాగా ఆ తర్వాత తీసిన రెండో సినిమానే ఈ చెన్నకేశవ రెడ్డి.

ఒకవేళ బాలయ్య బాబు-వివి వినాయక్ కాంబోలో మళ్లీ సినిమా అంటే కచ్చితంగా అది వాళ్ల అభిమానులకు గుడ్ న్యూసే అవుతుంది. కాకపోతే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందనేదే వేచిచూడాల్సి వుంటుంది.

Trending News