Lunch Menu At Krishnam Raju Condolence Meet Mogalthuru Viral: రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో ఈ నెల 11వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు, దశదినకర్మ అన్నీ హైదరాబాద్ లోనే జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన పుట్టి పెరిగిన మొగల్తూరులో ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు అక్కడ ఒక భారీ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం భారీ ఎత్తున ఖర్చు కూడా పెట్టారు.
సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఈ సభ కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది. సాధారణంగానే గోదావరి జిల్లాలో రాజుల ఆతిథ్యం అంటే అది వేరే లెవల్ లో ఉంటుంది. అదీ కాక కృష్ణంరాజు పూర్వీకులు జమీందారీ వ్యవస్థ నుంచి వచ్చిన వారు కావడంతో ఎవరు ఇంటికి వచ్చినా తినకుండా బయటకు పంపేవారు కాదు. కృష్ణంరాజు కుటుంబం నుంచి ఇదే లక్షణాలను ప్రభాస్ కూడా పుణికి పుచ్చుకున్నారు. ఆయన కూడా ఒక సినిమా షూటింగ్ కి వెళుతున్నారంటే తన సహా నటీనటులకు కూడా తన ఇంటి నుంచి క్యారేజ్ తీసుకు వెళుతూ ఉండాలి.
ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 70,000 మంది కోసం మెనూ సిద్ధం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 6 టన్నుల మటన్ కర్రీ, ఆరు టన్నుల మటన్ బిర్యానీ, ఒక టన్ను రొయ్యల గోంగూర, ఒక టన్ను రొయ్యల ఇగురు, ఒక టన్ను సాఫ్ట్ క్రాబ్, ఒక టన్ను బొమ్మిడాయిల పులుసు, ఆరు టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, ఆరు టన్నుల చికెన్ బిర్యాని, ఒక టన్ను పండుగప్ప ఫిష్ ఫ్రై, నాలుగు టన్నుల చందువా ఫిష్ ఫ్రై, రెండు టన్నుల చిట్టి చేపల పులుసు, ఇలా మొత్తం 22 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది.
ఇవి కాక రెండు లక్షల బూరెలు, నాన్ వెజ్ తినని వారి కోసం సుమారు 10 రకాల వెజ్ కర్రీస్ కూడా చేయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి తిని వెళ్ళే లాగానే నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. సంస్మరణ సభకు వచ్చి ఖాళీకడుపుతో వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో అప్పటికప్పుడు రెడీ అయ్యే విధంగా కూడా మరిన్ని వంటకాలు సిద్ధంగా ఉంచారు. మొత్తం మీద ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు సంస్మరణ సభ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్యకాలంలో ఇంతటి భారీ ఈవెంట్ అయితే జరిగిన దాఖలాలు లేవు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook