బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, యంగ్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ముగినిపోయారు. అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న బ్రహ్మస్త్ర సినిమా షూటింగ్ తొలి షెడ్యూల్లోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ కాస్తా సినిమా షూటింగ్తోపాటే అంతకంతకూ రెట్టింపవుతూ వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే పనిలో పడిన ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లైఫ్.కామ్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం ప్రస్తుతం ఈ జంట తమ ఇద్దరి ముందున్న కమిట్మెంట్స్ని పూర్తి చేసుకుని 2020లో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారట. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఇద్దరూ ఈ ప్రేమ పెళ్లి వార్తలను అవునని సమర్థించలేదు. అలాగని తమ పెళ్లి వార్తల్లో వాస్తవం లేదని ఖండించనూలేదని బాలీవుడ్‌లైఫ్.కామ్ పేర్కొంది.
ఇక ఈ ఇద్దరి వ్యక్తిగత జీవితం విషయాలకొస్తే, రణ్‌బీర్ కపూర్ మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సావరియా సినిమాలో తనతో కలిసి నటించిన సోనమ్ కపూర్‌తో ప్రేమలో పడినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. సోనమ్ కపూర్ తొలి సినిమా కూడా సావరియానే కావడం విశేషం.
సోనమ్ కపూర్ తర్వాత రణ్‌బీర్ కపూర్ కొన్నేళ్లపాటు తనతో కలిసి బచ్నా హై హసినో సినిమాలో నటించిన దీపికా పదుకునేతో ప్రేమలోపడ్డాడు. ఆ తర్వాత దీపికాకు గుడ్‌బై చెప్పి అనంతరం కత్రినా కైఫ్‌తో డేటింగ్ స్టార్ట్ చేశాడు. ఉన్నట్టుంది ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ ఈ ఇద్దరి మధ్య కూడా దూరం పెరిగింది.
కత్రినాతో విడిపోయిన తర్వాత కొంతకాలంపాటు ఒంటరిగా ఉన్న రణ్‌బీర్ కపూర్ ఇటీవల బ్రహ్మస్ర సినిమా షూటింగ్లో అలియా భట్‌కి దగ్గరయ్యాడు. ఇక అలియా భట్ విషయానికొస్తే, ఆమె హీరోయిన్గా పరిచయమైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో నటించిన సహ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో అలియా ప్రేమలో పడినట్టు ఓ టాక్ వినిపించినప్పటికీ... ఈ విషయంపై అటు సిద్ధార్థ్ కానీ లేదా ఇటు అలియా కానీ ఎప్పుడూ స్పందించలేదు.