ఇండియాలో దెయ్యాలున్న ప్రదేశాలు ఇవేనట..!

దెయ్యాలనేవి ఉన్నాయో లేవో ఎవరికీ తెలియవు. అయితే అనేక ఏళ్లుగా జనసంచారం లేని పలు ప్రాంతాలను, నిర్మానుష్యమైన కొన్ని ప్రదేశాలను దెయ్యాలు తిరిగే ప్రదేశాలుగా ప్రచారం చేస్తుంటారు కొందరు. అలాంటి ప్రదేశాలు నిజంగానే కొన్ని సందర్భాలలో భయాన్ని కలిగిస్తుంటాయి. పాతకాలం నాటి కోటలు, పురాతన కట్టడాలు, శ్మశానాలు, సమాధులను వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి పలు ప్రదేశాల గురించి మనం కూడా తెలుసుకుందాం. 

Last Updated : May 18, 2018, 04:56 PM IST
ఇండియాలో దెయ్యాలున్న ప్రదేశాలు ఇవేనట..!

దెయ్యాలనేవి ఉన్నాయో లేవో ఎవరికీ తెలియవు. అయితే అనేక ఏళ్లుగా జనసంచారం లేని పలు ప్రాంతాలను, నిర్మానుష్యమైన కొన్ని ప్రదేశాలను దెయ్యాలు తిరిగే ప్రదేశాలుగా ప్రచారం చేస్తుంటారు కొందరు. అలాంటి ప్రదేశాలు నిజంగానే కొన్ని సందర్భాలలో భయాన్ని కలిగిస్తుంటాయి. పాతకాలం నాటి కోటలు, పురాతన కట్టడాలు, శ్మశానాలు, సమాధులను వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి పలు ప్రదేశాల గురించి మనం కూడా తెలుసుకుందాం. 

భాన్గర్ కోట: రాజస్థాన్‌లోని భాన్గర్ కోటని భగవాన్ దాస్ అనే మహారాజు కట్టించాడట. ఆళ్వార్ జిల్లా పరిధిలోకి వచ్చే ఈ కోటలో రత్నావతి అనే రాజ వంశీకురాలు ఉండేదని.. ఆమెను వశం చేసుకోవడానికి ఓ మాయలఫకీరు వల పన్నాడని చాలామంది కథలుగా చెప్పుకుంటారు. అయితే రత్నావతి ఆ ఫకీరుని హతమార్చిందని కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. రాణీ రత్నావతి ఆత్మతో పాటు ఇంకా ఎందరో సైనికుల ఆత్మలు ఈ కోట చుట్టుప్రక్కల నివసించే జనాలకు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజుకి కూడా ఈ కోటలో సూర్యోదయానికి ముందు.. సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం నిషిద్ధం. 

కల్కా, సిమ్లా రైల్వే టన్నెల్ : కల్కా నుండి సిమ్లాకి రైలులో వెళ్తున్నప్పుడు ఈ టన్నెల్ కనిపిస్తుంది. కల్నల్ బారోగ్ అనే బ్రిటీష్ ఇంజనీరుకి ఈ టన్నెల్ నిర్మించే బాధ్యతను అప్పగించింది అప్పటి ప్రభుత్వం. కానీ  అతను ఆ బాధ్యతను నిర్వహించడంలో ఫెయిలయ్యాడు. తను అనుకున్న ప్రణాళిక ప్రకారంగా ఆ టన్నెల్ నిర్మాణం జరగలేదు.. సరికదా యాజమాన్యం నుండి అపవాదులను కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. అందుకే ఆ ఇంజనీరు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడట. తర్వాత ప్రభుత్వం ఆ టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. అయినప్పటికీ కల్నల్ బారోగ్ ఆత్మ ఇంకా ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో తిరుగుతుందని పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.

శనివార్ వాడా కోట: 1730లో బాజీరావు పీష్వా ఈ కోటను నిర్మించారు. ఇక్కడే తన తొలిభార్య కాశీబాయితో ఆయన నివసిస్తుండేవారు. ఎన్నో వీరగాథలతో పాటు కన్నీటిగాథలకు కూడా ఈ కోట పెట్టింది పేరు. ఇక్కడే బాజీరావు పీష్వా ఆత్మ ఇప్పటికీ సంచరిస్తూ ఉంటుందని కొందరు నమ్ముతూ ఉంటారు.

జటింగా: అస్సాంలోని డిమా హసావో అనే జిల్లాలోని పల్లెటూరి పేరే జటింగా. ఇప్పటికీ ఈ ప్రాంతానికి ఎక్కడి నుండో కొన్ని వేల పక్షులు వచ్చి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాయని అంటారు. ఆ సామూహిక ఆత్మహత్యలకు కారణం ఏమిటో ఇప్పటి వరకూ ఎవరూ కనుగొనకపోవడం ఆశ్చర్యం. దుష్టఆత్మలు దేవుడి నుండి శిక్షను పొందాక.. ఇలా పక్షులుగా మారి ఇక్కడికి వచ్చి రాలిపోతుంటాయని చాలామంది అంటారు. ఇప్పటికే అనేక మంది శాస్త్రవేత్తలు ఈ రహస్యం చేధించడానికి జటింగాకి వచ్చారు. కానీ ఎవరూ సరైన కారణం చెప్పలేకపోయారు. ఈ ప్రాంతంలో నివసిస్తే మంచిది కాదని చాలామంది ఆ పల్లెను ఖాళీ చేసి కూడా వెళ్లిపోయారట. ఇప్పుడు జటింగా అనేది ఒక నిర్మానుష్యమైన ప్రాంతం మాత్రమే.

ఫిరోజ్ షా కోట్లా: క్రీ.శ 1354లో ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించిన ఈ కోటలో జిన్నీలు అనే ఆత్మలు తిరుగుతుంటాయని కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. 

సంజయ వనం: దక్షిణ ఢిల్లీలో ఉండే అటవీప్రాంతం పేరే సంజయ వనం. 783 ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ ప్రాంతంలో రాత్రిపూట తెల్లని చీరలు ధరించిన కొందరు స్త్రీలు, మోటార్ సైకిళ్ల మీద పోతున్న పురుషులను ఆపి లిఫ్ట్ అడుగుతుంటారని కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.

అగ్రసేన్ బవోలి: సెంట్రల్ ఢిల్లీకి దగ్గరలో ఉన్న ఈ కట్టడంలో ఓ నీటి సరస్సు ఉండేదని.. అందులో ఎప్పుడూ నల్లటి నీరు పారుతూ ఉండేదని అంటారు. అప్పుడప్పుడు ఆ నీటి నుండి మాటలు వినిపించేవని.. సరస్సులోకి వచ్చి దూకి ఆత్మహత్య చేసుకోమని ఆ మాటలు ప్రేరేపిస్తుండేవని కొందరు అంటూ ఉంటారు. ఆ కథల సంగతి ఎలా ఉన్నా.. పర్యాటకంగా ఈ కట్టడం బాగా పాపులర్ అయ్యింది. పీకే సినిమా షూటింగ్ ఇక్కడే చేశారట.

డవ్ హిల్: పశ్చిమ బెంగాల్‌లోని కుర్సియోంగ్ ప్రాంతంలోని డవ్ హిల్ ఎన్నో చిత్రమైన సంఘటనలకు పెట్టింది పేరు. అప్పుడప్పుడు రాత్రిళ్లు జనాలకు ఇక్కడ తల లేని మొండాలు కలిసి ఒక చోట కూర్చొని చలి కాచుకుంటున్నట్లు కనిపిస్తాయట. దట్టమైన అడవులు ఉన్న ఈ ప్రాంతంలో ఆత్మహత్యలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయట.

డుమాస్ బీచ్: దక్షిణ గుజరాత్ ప్రాంతంలోని డుమాస్ బీచ్ కూడా కొన్ని అతీంద్రియ శక్తులకు ఆలవాలం అంటుంటారు. రాత్రి పూట ఇక్కడ అమ్మాయిలు నవ్వుతున్నట్లు శబ్దాలు వస్తుంటాయట. 

ఖైరతాబాద్ సైన్స్ కాలేజీ: హైదరాబాదులోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్న సైన్స్ కాలేజీ అనేక సంవత్సరాలుగా పాడుబడిన కట్టడంగా తయారైంది. పూర్తి నిర్మానుష్యంగా కనిపించే ఈ కట్టడాన్ని బాగుచేసే నాథుడు లేక దెయ్యాల కొంపగా తయారైంది. దీన్ని చూస్తేనే భయంగొల్పేవిధంగా ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. ఇందులో కూడా దయ్యాలు తిరుగుతుంటాయని పలు పుకార్లు హల్చల్ చేస్తున్నాయి.

(ఈ కథనంలో చెప్పిన పలు అంశాలు మేము సేకరించిన విషయాలు, ఇతరులు చెప్పిన సంఘటనల మీద ఆధారపడినవి మాత్రమే. వాటిని పూర్తి యదార్థమైన సంఘటనలుగా పాఠకులు పరిగణించవలసిన అవసరం లేదు)

 

Trending News