2.0 మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌పై ఆఫర్లే ఆఫర్లు..

2.0 మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌పై ఆఫర్లే ఆఫర్లు..

Last Updated : Nov 25, 2018, 02:08 PM IST
2.0 మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌పై ఆఫర్లే ఆఫర్లు..

సంచలనమైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 2.0 మూవీ ఈ నవంబర్ 29న ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా రోబోకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటించడం విశేషం. అక్షయ్ కుమార్ మొదటిసారిగా నటిస్తున్న దక్షిణాది చిత్రం కూడా ఇదే కావడం మరో విశేషం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ టికెంట్ బుకింగ్ కూడా ప్రారంభమైంది. అమెరికా, లండన్‌తోపాటు భారత్‌లో చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో 2.0 సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్ అందుబాటులోకొచ్చేసింది. 

భారత దేశ చలనచిత్ర చరిత్రలో ఇంతకముందెప్పుడూ లేని విధంగా సుమారు రూ.600 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన సినిమా ఇది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ రమేష్ బాలా వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ రూపంలో రూ.120 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇదేకాకుండా శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ రూపంలో మరో రూ. 350 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  

ఇదిలావుంటే, తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కోసం అమేజాన్, పేటీఎం, ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్లు గుప్పిస్తున్నట్టు తెలుస్తోంది. బుక్ మై షో యాప్‌పై అమేజాన్ పే ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి అమేజాన్ రూ.150 నుంచి రూ.255 వరకు మ్యాగ్జిమం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నట్టు సమాచారం. 

ఐసీఐసీఐ బ్యాంకు పేటీఎం ఆఫర్ : పేటీఎం మూవీస్‌పై ప్రతీ శనివారం లేదా ఆదివారం నాడు ఐసీఐసీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ICICINB ప్రోమో కోడ్ ఉపయోగించుకుని కనీసం 2 టికెట్స్ బుక్ చేసుకున్న వారికి రూ.100 క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించనుంది. 

పీవీఆర్ ఆఫర్స్ : ఒకవేళ పీవీఆర్ సైట్‌లో మీరు టికెట్స్ బుక్ చేసుకున్నట్టయితే, అక్కడ ఇప్పటికే ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పేటీఎం ద్వారా రూ.200 వరకు క్యాష్ బ్యాక్, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా చెల్లించిన వారికి రూ. 150 వరకు క్యాష్ బ్యాక్, ఫోన్‌పే ద్వారా టికెట్ డబ్బులు చెల్లించిన వారికి రూ.200 వరకు క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు పీవీఆర్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా రేపటి ఆదివారం నుంచే ఆ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యూనిట్ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అన్ని భాషల్లో కలిపి విడుదలైన తొలిరోజే ఈ సినిమా రూ.70 కోట్ల వ్యాపారం చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఇంత భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న 2.0 సినిమా ఆడియెన్స్ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే నవంబర్ 29 వరకు వేచిచూడాల్సిందే.

Trending News