షారుఖ్ ఖాన్‌కి ఐటీ షాక్.. ఎటాచ్‌మెంట్‌లో లగ్జరీ ఫామ్ హౌజ్ !!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ షాక్

Last Updated : Jan 30, 2018, 08:20 PM IST
షారుఖ్ ఖాన్‌కి ఐటీ షాక్.. ఎటాచ్‌మెంట్‌లో లగ్జరీ ఫామ్ హౌజ్ !!

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని బీచ్ సిటీ అలీబాగ్‌లో వున్న 'డేజా వు ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్'ని ఎటాచ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రొహిబిషన్ ఆఫ్ బినామి ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ కింద షారుఖ్‌కి నోటీసులు జారీచేసినట్టు సంబంధిత విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు. చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం ఒక ఆస్తికి మరొకరు బినామిగా వున్నారని విచారణ అధికారి భావించినట్టయితే, ఆ ఆస్తికి నిజమైన యజమాని అయిన వ్యక్తికి కానీ లేదా బినామిగా వున్న వ్యక్తికి కానీ ఎటాచ్‌మెంట్ నోటీసులు జారీ చేసే అధికారం వుంది అని సదరు అధికారి పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసిన తేదీ నుంచి 90 రోజులకి మించకుండా ఎటాచ్‌మెంట్ నోటీసులు జారీ చేసే వీలు సంబంధిత విచారణ అధికారికి వుంటుందని ఆ అధికారి తెలిపారు.

ఐటీ విభాగం ఎటాచ్ చేసిన ఫామ్ హౌజ్ ఆస్తి విలువ రూ. 146.7 మిలియన్స్ వుండగా, ఆ ఆస్తి మార్కెట్ విలువ అందుకు ఐదు రెట్లు అధికంగా వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 19,960 చదరపు మీటర్ల మేర విస్తరించి వున్న ఈ ఫామ్ హౌజ్‌లో ఓ బీచ్‌, స్విమ్మింగ్ పూల్, ప్రైవేటు హెలీప్యాడ్ లాంటి ఖరీదైన సౌకర్యాలు వున్నాయి. 

వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుని ఆ భూమిని కొనుగోలు చేసిన షారుఖ్... ఆ తర్వాత అందులో వ్యవసాయం చేయకుండా సొంత అవసరాలకు లగ్జరీ ఫామ్ హౌజ్‌గా ఉపయోగిస్తున్నారనేది షారుఖ్‌పై నమోదైన ప్రధానమైన అభియోగం.

Trending News