రాజకీయాల్లోకి వచ్చే అంశంపై క్లారిటీ ఇచ్చిన మహేష్

పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మహేష్

Last Updated : Apr 28, 2018, 05:40 PM IST
రాజకీయాల్లోకి వచ్చే అంశంపై క్లారిటీ ఇచ్చిన మహేష్

ప్రేక్షకుల అభిమానంతో వందేళ్ల వ‌ర‌కూ సినిమాల్లోనే న‌టిస్తాన‌ని సినీ హీరో మహేష్ బాబు స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని సినీ హీరో మహేష్‌ బాబు తేల్చిచెప్పేశారు.  తాజాగా న‌టించిన 'భ‌ర‌త్ అనే నేను' చిత్రం ఘన విజయం సాధించిన నేప‌థ్యంలో శుక్రవారం విజ‌య‌వాడ‌కు వచ్చారు. కొండమీదున్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం క్యాపిటల్‌ సినిమాస్‌లో ప్రేక్షకుల‌తో క‌ల‌సి సినిమాని వీక్షించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, 'భ‌ర‌త్ అనే నేను' మూవీని హిట్ చేసిన ప్రేక్షకుల‌కు కృత‌జ్ఞత‌లు తెలిపారు. సినిమాలో సీఎం పాత్రలో నటించారు.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా.. నటుడిగానే రాణిస్తానని, రాజ‌కీయాల్లోకి రానని అన్నారు. విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని, ఇక్కడికి రావడం సెంటిమెంట్‌గా భావిస్తానని మహేష్‌  అన్నారు. గతంలో ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి సినిమాల విజయోత్సవ సభలు విజయవాడలో జరిగాయని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా, రాష్ట్రవిభజన సమస్యల హామీలపై మీ స్పందన ఏంటని అడగ్గా.. తాను సినిమా గురించే మాట్లాడతానని.. సమాధానాన్ని దాట వేశారు.

ఇదిలా ఉండగా 'భ‌ర‌త్ అనే నేను' తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.161.28 కోట్ల గ్రాస్ క‌లెక్షన్స్ రాబ‌ట్టింది. అమెరికాలోనే తొలి వారంలో మూడు మిలియన్ డాల‌ర్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇక ఆస్ట్రేలియా, మ‌లేషియా, సింగ‌పూర్‌లతో పాటు మొత్తం విదేశాల్లో ఇప్పటి వ‌ర‌కూ ఈ చిత్రం 4.65 మిలియ‌న్ డాల‌ర్ల గ్రాస్ సాధించింది.

Trending News