Happy birthday Rana Daggubati | హ్యాపీ బర్త్ డే రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే.. అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రాల్లో భల్లాలదేవుని పాత్రలో ప్రేక్షకులను అలరించిన నటుడు దగ్గుబాటి రానా. తాత దగ్గుబాటి రామానాయుడు పేరును షార్ట్‌గా పెట్టుకున్న రానా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా  ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు.. సగటు ప్రేక్షకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

Updated: Dec 14, 2019, 02:33 PM IST
Happy birthday Rana Daggubati | హ్యాపీ బర్త్ డే రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే.. అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రాల్లో భల్లాలదేవుని పాత్రలో ప్రేక్షకులను అలరించిన నటుడు దగ్గుబాటి రానా. తాత దగ్గుబాటి రామానాయుడు పేరును షార్ట్‌గా పెట్టుకున్న రానా పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా  ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు.. సగటు ప్రేక్షకులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.   

తాత, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని...
రానా దగ్గుబాటి 1984 డిసెంబర్ 14న జన్మించారు. చెన్నై, హైదరాబాద్‌లో విద్య పూర్తయిన తర్వాత సినీ పరిశ్రమలోకి ప్రవేశించి మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు, తండ్రి సురేష్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. హీరోగా, మంచి నటుడిగా సినీ ప్రేక్షకులకు రానా సుపరిచితం. కానీ ఆయన చదువు పూర్తి కాగానే సినిమా నటుడిగా కెరీర్ ప్రారంభించలేదు. తొలుత విజువల్ ఎఫెక్ట్స్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. అంతే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పారిశ్రామికవేత్తగా  ఎదిగేందుకు కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. స్పిరిట్ మీడియా పేరుతో షార్ట్ ఫిల్మ్స్ తీయడం ప్రారంభించారు. దీంతో జాతీయస్థాయిలో అవార్డు గెలుచుకున్నారు.  

Read also : Happy Birthday Venkatesh | హ్యాపీ బర్త్ డే వెంకీమామ..

నటుడిగా తెరంగేట్రం...
దగ్గుబాటి రానా 2010లో తెలుగు చిత్రసీమలోకి నటుడిగా అడుగు పెట్టారు. లీడర్ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించారు. తొలి చిత్రంతోనే నటనలో తనదైన ముద్రవేశారు. తెలుగులో సుప్రసిద్ధ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకోవడం విశేషం. రానా తన రెండో సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిపాషా బసు సరసన కథానాయకుడిగా దమ్ మారో దమ్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత మూడో సినిమాను మళ్లీ తెలుగులో చేశారు. 2012లో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన కృష్ణమ్ వందే జగద్గురుమ్ చిత్రంలో హీరోగా నటించారు. ఐతే దగ్గుబాటి రానా ఎప్పుడూ హీరోగా మాత్రమే నటించేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. తనలోని నటనా శైలికి పదును పెట్టేందుకు మంచి మంచి కేరెక్టర్లను ఎంచుకున్నారు. ఇందుకు ఆయన చేసిన హిందీ చిత్రం బేబీ మొదటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రపంచస్థాయిలో తెలుగోడి సత్తా చాటిన బాహుబలి-1, బాహుబలి-2  చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్రను రానా పోషించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. నిజానికి బాహుబలి సినిమాకు బాలీవుడ్, హాలీవుడ్ సహా ఇతర దేశాల్లో అంత పేరు రావడానికి రానాయే కారణమని చెప్పవచ్చు. తనకు బాలీవుడ్‌లో ఉన్న పరిచయాలతో సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి రానా తన వంతు ప్రయత్నం చేశారు.

కొత్తకు పెద్ద పీట...  
బాహుబలి సినిమా తర్వాత.. మరో ప్రతిష్ఠాత్మక తెలుగు చిత్రం రుద్రమదేవిలోనూ రానా నటించారు. ఈ సినిమా పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ అయినప్పటికీ..  సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. దీంతో రుద్రమదేవి సినిమాకు మరింత క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. దగ్గుబాటి రానా.. ఎప్పుడూ ప్రయోగాలు చేయడంతో ముందుంటారు. ఇందుకు ఆయన చేసిన ఘాజీ చిత్రమే మరో చక్కటి ఉదాహరణ. ఘాజీ సినిమా విడుదలయ్యే వరకు పూర్తిస్థాయిలో నీటి అడుగున తీసిన భారతీయ సినిమా అంటూ ఏదీ లేదు. 2017లో ఆ సినిమాను చేసి ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు దగ్గుబాటి రానా. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 34 కోట్లు వసూలు చేసింది. 

కథలు ఎంచుకోవడంలోనూ రానాకు మంచి పట్టుందని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి కోవలోనే వచ్చిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ సినిమాతోనే ప్రముఖ దర్శకుడు తేజ దాదాపు దశాబ్ధకాలం తర్వాత సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ సినిమా ద్వారా రానా కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. రుద్రమదేవి సక్సెస్ తర్వాత.. ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ తలపెట్టిన తరువాతి చిత్రం ''హిరణ్యకశ్యప''లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు దగ్గుబాటి రానా.  

స్టార్ హీరో అయినా..  
తాత, తండ్రి, బాబాయి వెంకటేష్ సినీ పరిశ్రమలో పెద్ద పేరు ప్రతిష్ఠలు సంపాదించినప్పటికీ... తాను కూడా సొంతంగానే కష్టపడి పైకొచ్చి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆడియెన్స్ అందరూ గుర్తించే స్థాయిలో స్టార్ హీరోగా ఎదిగారు. మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ఎంత స్టార్‌డం ఉన్నప్పటికీ.. సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడటం రానా దగ్గుబాటిలో ఉన్న మరో ప్రత్యేకత. స్టార్ హీరోననే ఫీలింగ్ కానీ.. లేదా సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబం నుంచి వచ్చాననే గర్వం కానీ ఆయనలో కనిపించదు. వృత్తిగత జీవితంతోపాటు వ్యక్తిగత జీవితంలోని విషయాలను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకునే రానా అంటే ఇష్టపడని వారుండరు. కుడి వైపున ఉన్న కన్ను కనిపించదని.. ఎడమ వైపు ఉన్న కన్ను ట్రాన్స్‌ప్లాంట్ చేసిందని ఓ టీవీ షోలో తనకు తానే నిర్భయంగా బయటకు చెప్పి.. కష్టాలను, లోపాలను ధైర్యంతో ఎదుర్కోవాలే కానీ భయపడకూడదని చెప్పే రానా అంటే ఎందరికో ఆదర్శం. 14 సంవత్సరాల వయసులో తన కళ్లకు శస్త్రచికిత్స చేశారని అభిమానులతో పంచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన రానాలో ఓ సామాన్యుడు, సౌమ్యుడు దాగున్నాడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. 

నిర్మాతగానూ రాణింపు..
సినీ రంగంలో మంచి నటుడిగా ఎదుగుతూనే.. ప్రొడక్షన్ పైనా దృష్టిసారించారు రానా. టెలివిజన్ రంగంలో కొన్ని ప్రొగ్రామ్‌లకు తానే వ్యాఖ్యాతగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మంచి వ్యాపారవేత్తగా ఎదగాలనుకుంటున్న దగ్గుబాటి రానాకు ప్రేక్షకుల తరఫున ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం. అలాగే జగమెరిగిన భల్లాల దేవునికి జీ హిందూస్తాన్ తెలుగు తరపున, ఆడియెన్స్, అభిమానుల తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్ డే రానా....

Read also : Rajinikanth birthday special | హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్... బస్ కండక్టర్ టు సూపర్ స్టార్.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్