ఇంగ్లీష్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ దర్శకులు వీరే

హాలీవుడ్‌తో పాటు పలు విదేశీ భాషల్లో సినిమాలు తీసిన భారతీయ దర్శకులు చాలామంది ఉన్నారు.

Updated: Jul 13, 2018, 05:22 PM IST
ఇంగ్లీష్ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ దర్శకులు వీరే

హాలీవుడ్‌తో పాటు పలు విదేశీ భాషల్లో సినిమాలు తీసిన భారతీయ దర్శకులు చాలామంది ఉన్నారు. అయితే అలాంటి వారిలో తెలుగువారు చాలా అరుదుగా కనిపిస్తారు. తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన పలువురు దర్శకులు ఇంగ్లీష్ సినిమాలు, డాక్యుమెంటరీలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారిలో అలనాటి ప్రముఖ దర్శకులతో పాటు యువ దర్శకులు  కూడా ఉన్నారు. మరి వారెవరో మనం కూడా తెలుసుకుందామా..!

గౌతమ్ ఘోష్  - 1980లో "మా భూమి" సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయమైనా..  ఆ తర్వాత ఎలాంటి తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ బెంగాల్‌లో మాత్రం ఆయన ప్రముఖ దర్శకుడిగా ఎదిగారు. సామాజికాభ్యుదయాన్ని పెంపొందించే ఎన్నో మంచి చిత్రాలు తీశారు. అలాగే హంగ్రీ ఆటమ్, ల్యాండ్ ఆఫ్ సీ డ్యూన్స్ లాంటి ఇంగ్లీష్ డాక్యుమెంటరీలకు కూడా దర్శకత్వం వహించారు 

సింగీతం శ్రీనివాసరావు - తెలుగులో భైరవ ద్వీపం, పుష్పక విమానం లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాస రావు, ఇంగ్లీష్‌‌లో "సన్ ఆఫ్ అల్లాదీన్" పేరుతో ఓ యానిమేషన్ మూవీ తీశారు. 

రాజేష్ టచ్ రివర్ - తెలుగులో 10, ఎలెక్స్, నా బంగారు తల్లి లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన రాజేష్ టచ్ రివర్ ఇంగ్లీష్‌లో అనేక డాక్యుమెంటరీలు, సినిమాలు తీశారు. ఇన్ ద నేమ్ ఆఫ్ బుద్దా అనే ఆంగ్ల చిత్రంతో పాటు అనామిక ది నేమ్ లెస్, మీ అండ్ అస్, ఏ ఛాన్స్ టు లివ్, ఆస్తా - ఏన్ ఓడ్ టు లైఫ్ లాంటి ఇంగ్లీష్ డాక్యుమెంటరీలు కూడా తీశారు. 

ఎస్వీ క్రిష్ణారెడ్డి- ఎస్వీ క్రిష్ణారెడ్డి టాలీవుడ్‌లో ఎంత పేరెన్నిక గల దర్శకుడో మనకు తెలియంది కాదు. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన "ఆహ్వానం" చిత్రం హాలీవుడ్‌లో కూడా రీమేక్ అయ్యింది. 2012లో "డైవర్స్ ఇన్విటేషన్" పేరుతో ఆ చిత్రం అమెరికాలో విడుదలైంది. 

శేఖర్ కమ్ముల- ఆనంద్, హ్యాపీడేస్, లీడర్, గోదావరి లాంటి చిత్రాలతో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. అయితే ఆయన తీసిన తొలి సినిమా ఓ ఇంగ్లీష్ చిత్రమనే విషయం చాలామందికి తెలియదు. "డాలర్ డ్రీమ్స్" అనే ఆంగ్ల చిత్రానికి శేఖర్ కమ్ముల 2000లో దర్శకత్వం వహించారు. ఆ చిత్రానికి జాతీయ పురస్కారం కూడా పొందారు. 

రాజ్ నిడిమోరు, డీకే క్రిష్ణ- తెలుగులో వచ్చిన "డీ ఫర్ దోపిడి" చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన తెలుగు కుర్రాళ్లు మరియు గో గోవా గోన్, హ్యాపీ ఎండింగ్ లాంటి బాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, డీకే క్రిష్ణ 2003లో "ఫ్లేవర్స్" పేరుతో ఓ హాలీవుడ్ సినిమాని తీశారు. 

నాగ్ ఆశ్విన్- మహానటి, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ తన కెరీర్‌ను ఓ ఇంగ్లీష్ షార్ట్ ఫిలింతో మొదలు పెట్టారు. దాని పేరు "యాదోంకీ బారాత్"

రామ్ గోపాల్ వర్మ- "శివ" సినిమాతో తెలుగులో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా చాలా చిత్రాాలు తీశారు. ఆయన తీసిన తొలి ఇంగ్లీష్ షార్ట్ ఫిలిమ్ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.