జైపూర్: ఒకే ఆస్పత్రిలో 48 గంటల వ్యవధిలో 10 మంది శిశువులు మృతి చెందిన ఘటన రాజస్తాన్‌లోని కోటలో కలకలం సృష్టించింది. కోటలోని నారాయణ్‌పూర్‌లో ఉన్న జేకే లోన్ ప్రభుత్వ ఆస్పత్రిలో డిసెంబర్23-24 తేదీల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన శిశువుల్లో ఒకరు ఏడాది వయస్సున్న వారు కాగా మిగతా వారిలో నలుగురు ఒక రోజు నుంచి నాలుగు రోజుల వయసు, మరో ముగ్గురు నెలన్నర నుంచి ఐదు నెలలలోపు శిశువులే ఉన్నారు. మరొక శిశువు 9 నెలలు ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా హెచ్ఎల్ మీనా తెలిపారు. ఆసుపత్రిలోని పీడియాట్రిక్స్ కేర్ యూనిట్ (PICU), నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో చికిత్స పొందుతున్న శిశువులు ఉన్నట్టుండి ఇలా మృత్యువాత పడటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆస్పత్రి రికార్డుల ప్రకారం ఆరుగురు శిశువులు డిసెంబర్ 23న మృతిచెందగా మరో నలుగురు శిశువులు డిసెంబర్ 24న చనిపోయారు.
జేకే లోన్ ఆస్పత్రి ఘటనపై విచారణ జరిపేందుకు జైపూర్ ఎస్ఎస్ఎస్ మెడికల్ కాలేజీ నుంచి ముగ్గురు సభ్యుల విచారణ బృందం కోటకు చేరుకుంది. ఈ ఘటనపై చేపట్టిన విచారణ బృందం.. శిశువుల మృతి వెనుకున్న కారణాలను తెలుసుకునే పనిలో పడింది.