వదంతులను వ్యాపింపజేస్తున్న వెబ్‌సైట్లను, అందులో ఉండే కంటెంట్‌ను ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల నుంచి తొలగించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం మంగళవారం తెలిపారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని ఈ చర్యలను తీసుకున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో 1662 ఫేక్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసినట్లు తెలిపారు.
1076 యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేయాల్సిందిగా కోరగా.. ఫేస్‌బుక్ 956 యూఆర్‌ఎల్‌లను, ట్విటర్‌కు 728 యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేయాల్సిందిగా కోరగా 409, యూట్యూబ్ 152, ఇన్‌స్టాగ్రామ్ 66 యూఆర్‌ఎల్‌లను, మిగితా సామాజిక మాధ్యమాల్లో 79 యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేసినట్లు లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. జనవరి 2017 నుంచి జూన్ 2018 వరకు వీటిని బ్లాక్ చేసినట్లు తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు వెబ్‌సైట్, సోషల్ మీడియాలను మానిటర్ చేస్తోందని, చట్టాలను అతిక్రమించిన వారిపై ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69ఏను అనుసరించి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. వదంతుల కారణంగా దేశంలో మూక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. అటువంటి పుకార్లకు వేదికైన సోషల్ మీడియా కూడా ప్రేరేపకాలుగానే భావిస్తామని, చట్టపరమైన చర్యలను తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.