ఢిల్లీ బురారీ ఘటన మర్చిపోకముందే జార్ఖండ్ రాజధాని రాంచీలో మరో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన కనీసం ఏడుగురు ఆత్యహత్య చేసుకున్నారు. రాంచీలోని కాంకే పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న కుటుంబ సభ్యులు ఈ సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదే నెలలో జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఒక అపార్ట్మెంట్‌లో ఓ కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్యహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. జాతీయ మీడియా కథనం మేరకు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్యహత్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నెలరోజుల క్రితం ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యలు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..! మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి 11 మంది తమ నిండు ప్రాణాలను పొగొట్టుకున్నారు. ఇంకా ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతూ ఉంది.