వాట్సాప్‌ను హెచ్చరించిన కేంద్రం

ప్రముఖ సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated: Jul 4, 2018, 09:44 AM IST
వాట్సాప్‌ను హెచ్చరించిన కేంద్రం

ప్రముఖ సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు, రెచ్చగొట్టే విధంగా ఉండే సందేశాలు వైరల్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం వాట్సాప్‌ను హెచ్చరించింది. ఇటువంటి ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు ప్రచారం కావడం వల్ల అవి నిజమనుకొని పలువురు అమాయకులపై కొందరు దాడులకు దిగుతున్నారని తెలిపింది. ఒక్కోసారి బాధితులు ప్రాణాలు కోల్పోయే ఘటనలు జరుగుతుండటంతో పాటు శాంతిభద్రతలకు సమస్యలు తలెత్తుతున్నట్లు వివరించింది.

ఇటీవల కాలంలో పిల్లలను అపహరించుకుపోతున్నారంటూ వాట్సాప్‌లో నకిలీ వార్తలు వైరల్‌గా మారాయి. అసోం, మహారాష్ట్ర, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ నకిలీ సందేశాలను నమ్మి ప్రజలు అమాయకులపై దాడికి దిగుతున్నారు. మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఇలాగే చిన్నారులను అపహరించుకుపోయే గ్యాంగ్‌ తిరుగుతుందని వాట్సాప్‌లో మెసేజ్ రావడంతో.. ఆ ప్రాంతంలో తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను కొట్టి చంపారు.