అన్నా సత్యాగ్రహం... మోడీకి ఘాటు లేఖ

                   

Last Updated : Oct 2, 2017, 06:17 PM IST
అన్నా సత్యాగ్రహం... మోడీకి ఘాటు లేఖ

న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం శీతకన్ను వేసిందని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే విమర్శించారు. ఈ సారి మళ్లీ సత్యాగ్రహం ప్రారంభించాల్సిందేనని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు వెళ్ళి మహాత్మగాంధీకి నివాళులర్పించిన తర్వాత.. అక్కడిక్కడే ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. ఈ ప్రభుత్వం పాలనలో.. ఆ మహాత్ముడు కన్న కలలన్నీ కల్లలుగానే ఉండిపోతున్నాయని.. అందుకు ఆవేదనగా ఉందని చెప్పారు. హజారే మీడియాతో మాట్లాడుతూ 'ఈరోజు అక్టోబర్ 2. గాంధీ జయంతి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా గాంధీజీ కలలు ఏమీ నెరవేరలేదు. ఆయన ఆశయాలకు ఇప్పటికీ మనం సత్యదూరమే. అందుకే ఆయన సమాధి సాక్షిగా ఇక్కడే  సత్యాగ్రహం చేస్తాను' అని తెలిపారు. ప్రధాని పనీతీరు చెప్పుకోదగ్గ రీతిలో లేదని, అందుకే నిరాహార దీక్షకు దిగుతున్నానని చెప్పారు.
 
లోక్‌పాల్‌పై ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రధాని మోదీకి హజారే లేఖ రాశారు. లోక్‌పాల్, లోకాయుక్తను ప్రభుత్వం ఎందుకు నియమించలేదని అడిగారు. సోమవారం నిరాహార దీక్ష పూర్తి చేసిన తర్వాత మరోసారి ఆందోళన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో అవినీతిని కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని తప్పుపట్టారు. 'జనాలు ఎన్నో ఆకాంక్షలతో మిమ్మల్ని నమ్మి అధికారాన్ని కట్టబెడితే... వారి నుండే మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు. అవినీతి దేశంలో పెరిగిపోతోంది. ప్రతి దినం దీనిని ప్రజలు గమనిస్తున్నారు' అని ప్రధాని మోడీకి రాసిన ఉత్తరంలో హజారే తెలియజేశారు.

Trending News