న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్ర నేత అరుణ్ జైట్లీ(66) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 9వ తేదీన అనారోగ్యంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన అరుణ్ జైట్లీ ఆరోగ్యం ఆ తర్వాత మరింత క్షీణించడంతో లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మృతితో ఆయన అభిమానులు, బీజేపి శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన అరుణ్ జైట్లీ ఆ తర్వాత రాజకీయాల్లో చేరి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఆయన కీలక పదవుల్లో పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించి దేశానికి సేవలు అందించారు.