2జీ స్పెక్ట్రం కేసులో మాజీ మంత్రి ఎ.రాజా, కనిమొళితో పాటు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. తాను తీర్పు విషయంలో ఏమీ మాట్లాడబోనని.. అయితే కేవలం కేసు గెలిచినంత మాత్రాన.. యూపీఐది అమాయకమైన పాత్ర అని చెప్పలేమన్నారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులు పక్షపాతంతోనే జరిగాయని తాను ఇప్పటికీ నమ్ముతానని.. అలా జరిగినందుకే అప్పట్లో సుప్రీంకోర్టు స్పెక్ట్రమ్ కేటాయింపుల లైసెన్సులను రద్దుచేసిందని ఆయన గుర్తుచేశారు.
కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ 'బ్యాడ్జ్ ఆఫ్ హానర్'గా పరిగణించరాదని.. అసలు అలాంటి అవకతవకలు వారి హయంలో ఎందుకు జరిగాయన్న విషయంపై సమీక్షించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీఐ తప్పిదాల వలనే ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన తెలియజేశారు. ఈ కేసును ఇంకా పూర్తిగా మూయలేదని.. ఇదే విషయమై తదుపరి దర్యాప్తులు సీబీఐ ఆధ్వర్యంలో జరుగుతాయని ఆయన చెప్పారు.