'కరోనా వైరస్'.. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం మొత్తం పోరాడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వేలాది మంది తుది శ్వాస విడిచారు. కరోనా దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోగులు జీవన్మరణ పోరాటం సాగిస్తున్నారు.
కరోనా బారిన పడ్డ వ్యక్తి.. చుట్టు పక్కల ఉన్న వారికీ ఈ వ్యాధిని అంటించే అవకాశం ఉంది. అంటే కరోనా వైరస్ కోసం 24 గంటలు శ్రమిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి కూడా ఎప్పుడూ ప్రమాదం పొంచే ఉంటుందన్నమాట. దీంతో కరోనా వైరస్ బారిన పడ్డ వారికి చికిత్స చేయడానికి వారు నిత్యం ప్రాణాలతో పోరాడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారు చేసే వృత్తి ధైర్య సాహసాలతో కూడినదనే చెప్పాలి.
ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసే క్రమంలో ఎప్పుడైనా వారు మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే మనం చూశాం. ఐతే కరోనా పాజిటివ్ రోగులకు ట్యాబ్లెట్లు అందించడానికి , ఆహారం అందించడానికి ఇప్పటికే రోబోలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఓ విద్యార్థి.. ఇంటర్నెట్ ఆధారితంగా పని చేసే రోబోను తయారు చేశారు.
ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ లో యోగేష్ సాహు అనే విద్యార్థి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గమనించి ఈ రోబోను తయారు చేసేందుకు శ్రీకారం చుట్టాడు. ఈ రోబో ఇంటర్నెట్ ఆధారంగా పని చేస్తుందని .. దీన్ని వైద్యులు నియంత్రిస్తూ కరోనా రోగులకు చికిత్స అందించవచ్చని తెలిపాడు. అంటే కరోనా బాధితులకు వైద్యం చేయడం కోసం నిత్యం వారి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే వైద్యులు ఎక్కడి నుంచైనా తమ సేవలు అందించవచ్చన్నమాట.
ప్రస్తుతం ఈ రోబోకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ఐతే ఆర్ధికంగా ఎవరైనా పెట్టుబడి పెట్టేవారు ఉంటే దీన్ని ఎక్కువ సంఖ్యలో తయారు చేసి ఇస్తానని చెబుతున్నాడు యోగేష్ సాహు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
'కరోనా' చికిత్సకు... రోబో 3.0