Why Fair Price Shops on Strike: ఆహార భద్రతా చట్టం కింద ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తోన్న ఉచిత రేషన్ సరుకులను జనం వరకు చేరవేయడంలో రేషన్ డీలర్ల పాత్ర ఎంతో కీలకం. రేపటి నుంచి రానున్న మరో 3 రోజుల పాటు రేషన్ దుకాణాలు మూసి ఉండనుండటంతో రేషన్ సరుకులు లభించే అవకాశం ఉండదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాలకు వర్తిస్తుంది. రేషన్ డీలర్లు ఫిబ్రవరి 7, 8, 9 తేదీలలో ధర్నాలో పాల్గొంటుండమే అందుకు కారణం.
తమకు కమిషన్ల ప్రాతిపదికన మాత్రమే కాకుండా ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని కోరుతూ 11 డిమాండ్లతో రేషన్ డీలర్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా రేషన్ డీలర్ల సంఘాలు ధర్నాలు చేస్తూనే వస్తున్నాయి. పలుమార్లు దేశ రాజధాని ఢిల్లీలోనూ నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ ఇంకా ఆ డిమాండ్లు ఏవీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో మరోసారి తాము ఆందోళన బాట పట్టక తప్పడం లేదని రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ప్రకటించింది.
తమ పరిస్థితి రాన్రాను మరింత దయనీయంగా, అగమ్య గోచరంగా తయారైందని రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. మానవతా దృక్పథంతో తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా అనేకసార్లు కేంద్రాన్ని కోరినప్పటికీ.. తమ వ్యయ ప్రయాసలన్నీ వృధా అయ్యాయి. అందుకే బతుకే భారం అవుతున్న తరుణంలో ఇక ఆందోళన చేపట్టడానికే సిద్ధమైనట్టు రేషన్ డీలర్స్ ఫెడరేషన్ స్పష్టంచేసింది.
2023 కేంద్ర బడ్జెట్లో రేషన్ డీలర్ల సమస్య పరిష్కారించడంతో పాటు రేషన్ వినియోగదారుల సంక్షేమం దిశగా కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమనని ఆశగా ఎదురుచూశాం. కానీ అలాంటిదేమీ జరగలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లోనే ధర్నాకు దిగుతున్నామని ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. కేంద్రం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని కొనసాగిస్తుందని ఆశించినప్పటికీ అది కూడా జరగలేదు. అలాగే పప్పు ధాన్యాలు, వంట నూనెలు, పంచదార వంటి సరుకుల ధరలను నియంత్రించడానికి రేషన్ దుకాణాల ద్వారానే పంపిణి చేయించాలన్న డిమాండ్ ని కూడా కేంద్రం పెడచెవినపెట్టింది. రేషన్ డీలర్ల సమస్యలు కోసమే కాకుండా వినియోగదారుల సంక్షేమం కోసం కూడా తాము పోరాడుతున్నామని ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ అభిప్రాయపడింది.