అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడుతున్నారని పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే.. అటు వైపు నుంచి జవాబు రాలేదు కానీ కౌగిలింత మాత్రం వచ్చిందంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించారు. షాజహాన్‌పూర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన మోదీ రైతు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్న వారికి కేవలం ప్రధాని పీఠం మాత్రమే కనిపిస్తోందని అన్నారు. దేశ ప్రజల హితం కోసం పని చేయడం, అవినీతిపై పోరాట చేయడం వారికి తప్పుగా అనిపిస్తోందని అన్నారు.
అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతోనే ఏం చేయాలో తెలీక రాహుల్ గాంధీ తనను అనుకోకుండా ఆలింగనం చేసుకున్నారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడుతున్నారో కారణాలు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీని కోరగా.. కారణాలు చెప్పడంలో వారు విఫలమయ్యారని.. అనుకోని ఆలింగనంతో ముగించారని మోదీ చెప్పుకొచ్చారు. విపక్షాల ఐక్యతే బీజేపీకి ప్లస్ అని అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల కళ్లన్నీ ప్రధాని పీఠంపైనే ఉన్నాయని.. పేదలు, యువత, రైతుల శ్రేయస్సును మరిచిపోయాయని రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు మోదీ.
రైతు ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ఉత్తరప్రదేశ్‌లో గత పాలకుల తీరును కూడా ఎండగట్టారు. రైతుల కోసం గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదంటూ విమర్శించారు. ఎన్నికల ర్యాలీకి వెళ్లే ముందు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఎల్లప్పుడు రైతులతో గడపడం నాకిష్టం. అన్నదాతలు కష్టజీవులు, దేశం కోసం వారెంతో చేశారని ట్వీట్ చేశారు.