కర్ణాటకలో కొన్ని రోజుల క్రితం జరిగిన హత్య కేసులో మూడేళ్ల చిన్నారి సాక్ష్యం కీలకంగా మారడంతో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. ఇక్కడ ఆశ్చర్యం కల్గించే విషయం ఏమిటంటే.. సాక్ష్యం చెప్పిన ఆ చిన్నారి స్వయానా నిందితుడి కుమారుడే. కర్ణాటకలోని ఓ సెషన్స్ కోర్టు జడ్జీ ఈ కేసులో కేవలం 13 రోజుల్లోనే నిందితుడిని దోషిగా తేల్చి తీర్పు వెలువరించారు. ఈ కేసుల మూడేళ్ల చిన్నారి ప్రకటన కీలక పాత్ర పోషించిందని, మరో 36 మంది కూడా సాక్ష్యమిచ్చారని జడ్జీ పేర్కొన్నారు.
బెంగళూరులోని బగ్గలురంగవనహళ్లి గ్రామానికి చెందిన శ్రీధర్(35) అనే కార్మికుడికి మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న చిన్నారి ఉన్నారు. అయితే శ్రీధర్ తన భార్య సాకమ్మ(31) మరొకరితో లైంగిక సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తరచూ గొడవ పడేవాడు. గత నెల 27న కూడా శ్రీధర్ తన భార్యతో గొడవకు దిగి.. తీవ్ర ఆవేశానికి గురై పిల్లల ముందే భార్యను చంపేశాడు. ఈ ఘటనను చూసి భయపడిన మూడేళ్ల బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి.. ఇంటిపక్కనుండే బంధువుల ఇంటికి వెళ్లి సంగతి చెప్పాడు. వారు వచ్చేసరికి సాకమ్మ రక్తపు మడుగులో పడి ఉంది.
దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారమివ్వగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శ్రీధర్‌ను అరెస్టు చేసి విచారించి సోమవారం సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న శ్రీధర్ కుమారుడిని కూడా కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో కోర్టులో తన తండ్రిని చూస్తూనే మా అమ్మను ఎందుకు చంపేశావంటూ ప్రశ్నించాడు. దీనితో నిందితుడి శ్రీధర్‌పై నేరం రుజువైంది. త్వరలోనే శిక్ష ఖరారు కానుంది. శ్రీధర్ జైలుశిక్ష తరువాత తిరిగి వచ్చి తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని జడ్జీ చెప్పారు. అప్పటివరకు పిల్లలకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని న్యాయమూర్తి అన్నారు.